100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును సొంతం చేసుకున్న ఏకైక క్రికెట్ సచిన్ తెందుల్కర్. ఇతడు తొలిసారి మూడంకెల స్కోరు అందుకుని నేటికి 30 ఏళ్లు. శతక శతకాల ప్రయాణానికి తొలి అడుగు పడింది ఈ రోజే (ఆగస్టు 14). 1990లో ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్‌లో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 119 పరుగులు చేసి జట్టును ఓటమి నుంచి తప్పించాడు మాస్టర్. మూడు దశాబ్దాల క్రితం సాధించిన ఆ ఘనత అతడి జ్ఞాపకాల్లో ఇంకా కొత్తగానే ఉంది. ఆ సెంచరీ గురించి అడగ్గా.. తనకు అదెంతో ప్రత్యేకమని చెప్పాడు.
"ఆగస్టు 14న ఆ శతకం చేశా. ఆ తర్వాతి రోజు భారత స్వాతంత్ర్య దినోత్సవం. కాబట్టి ఆ సెంచరీ చాలా ప్రత్యేకం. స్వాతంత్య్ర దినోత్సవానికి ముడిపెడుతూ నా సెంచరీ గురించి శీర్షికలు పెట్టారు. ఓవల్‌లో జరిగే తర్వాతి టెస్టు వరకైనా సిరీస్ ఆశలను సజీవంగా నిలిపిన శతకమది. జట్టు కోసం మ్యాచ్‌ను కాపాడటం నాకు కొత్త అనుభూతి. అంతకుముందు పాకిస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో వకార్ యూనిస్ వేసిన బంతి, నా ముక్కుకు తగిలి రక్తం వచ్చినప్పటికీ అలానే బ్యాటింగ్ కొనసాగించి 57 పరుగులు చేశా. 38కే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో మ్యాచ్‌ను కాపాడే ఇన్నింగ్స్ ఆడా. ఆ ఘటన నన్ను మరింత బలవంతుడిగా మార్చింది"
సచిన్ తెందుల్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఆ తర్వాత అదే స్ఫూర్తితో ఇంగ్లాండ్‌లో ప్రత్యర్థి పేసర్ల సవాళ్లను ఎదుర్కొని తొలి శతకం సాధించినట్లు సచిన్ చెప్పాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అప్పటి ప్రపంచ వేగవంతమైన బౌలర్లలో ఒకడైన డెవాన్ మాల్కోమ్ బంతి, సచిన్ తల వెనకాల తగిలింది. "మాల్కోమ్, వకార్ అప్పట్లో అత్యంత వేగవంతమైన బౌలర్లు. వాళ్ల బంతులు నాకు తగిలినప్పటికీ నేను ఫిజియోను పిలవలేదు. నొప్పితో ఉన్నానని బౌలర్లకు తెలిసేలా చేయాలనుకోలేదు. నేను ముంబయిలో ప్రాక్టీస్ చేసేటపుడు నాకు బంతి తగిలినా అలాగే ఆడమని కోచ్ అచ్రేకర్ చెప్పేవారు" అని సచిన్ వివరించాడు.
'నా మనసును తాకింది'
ఇంగ్లాండ్ ఎదురుదాడికి ప్రయత్నించినప్పటికీ చాలా ఓపికగా ఆడి మ్యాచ్ డ్రాగా ముగించామని ఆనాటి జ్ఞాపకాలను వెల్లడించాడు సచిన్. "అప్పుడు నాకు 17 ఏళ్లే. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచినందుకు షాంపైన్ బాటిల్ ఇచ్చారు. నాకేమో తాగేందుకు అధికారిక వయసు కూడా రాలేదు. దీంతో ఆ బాటిల్‌ను ఏం చేస్తావంటూ సీనియర్ ఆటగాళ్లు అడిగారు. ఆ సెంచరీ చేసినందుకు సంజయ్ మంజ్రేకర్ తెల్లటి షర్ట్ ఇవ్వడం నా మనసును హత్తుకుంది" అని సచిన్ పేర్కొన్నాడు.