ఐపీఎల్లో ఆడాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది ఆటగాళ్లే అంటూ సచిన్ స్పందించాడు. ప్రతి క్రీడాకారుడు వారి అవసరాన్ని బట్టి నడుచుకోవాల్సి ఉంటుందన్నాడు.
- ఈ శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. అయితే వీటిలో పాల్గొనడంపై భారత క్రికెటర్లు అయోమయంలో ఉన్నారు. ఏదైనా గాయమైతే ప్రతిష్ఠాత్మక మెగాటోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్లో విఫలమైతే ఆ ప్రభావం ప్రపంచకప్ తుది జాబితాపైనా పడుతుంది. ఇవన్నీ క్రికెటర్లకు ప్రశ్నలుగా మారాయి.
ఈ అంశంపై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఎవరి అవసరాన్ని బట్టి వారు ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అది వ్యక్తిగత అంశమని వ్యాఖ్యానించాడు.
'నా దృష్టిలో ఇదొక గొప్ప సమయం. ప్రతి ఒక్కరు బాగా ఆలోచించి ఏది అవసరమో నిర్ణయించుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలా వద్దా అన్నది వ్యక్తిగతం. వారి అవసరాలు, సమస్యల ఆధారంగా ఎవరికి వారే దీనిపై ఆలోచన చేయాలి.'
-- సచిన్ తెందూల్కర్, భారత మాజీ క్రికెటర్
ఐపీఎల్ తర్వాత ముంబయి ప్రీమియర్ లీగ్ జరగనున్నట్లు మాస్టర్ బ్లాస్టర్ తెలిపాడు. ఈ లీగ్‌ల వల్ల ఆటగాళ్లలోని నైపుణ్యం, ప్రతిభ బయటకు వస్తాయన్నాడు. అందరికీ రంజీలు, దులీప్ ట్రోఫీ, ఐపీఎల్లో ఆడే అవకాశం రాదని.. ప్రతిభ ఉన్నవారికి ఇది ఒక అవకాశంగా తయారవుతుందన్నాడు.
ఇప్పటికే ఎమ్‌పీఎల్ ద్వారా ముగ్గురు ఐపీఎల్‌కు పరిచయం అయ్యారు.. మిగతావారికి ఇది ఒక ఉత్సాహం ఇస్తుంది. భారత్‌కు ఆడాలన్న ఆశను నెరవేర్చుకోడానికి ఇదొక గొప్ప వేదిక అంటూ వివరించాడు సచిన్.
- ఐపీఎల్లో అన్ని జట్లు బలంగానే ఉన్నాయి. అందుకే మంచి పోటీ ఉంటుందని భావిస్తున్నానని స్పష్టం చేశాడీ క్రికెట్ దిగ్గజం.
ప్రస్తుతం సచిన్ ముంబయి ఐపీఎల్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టు మార్చి 24న దిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడనుంది.