ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌శర్మ విజయవంతమవ్వడానికి కారణం ప్రత్యర్థుల గురించి సమగ్ర సమాచారం రాబట్టడమేనని ఆ జట్టు కోచ్, శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్ మహేళా జయవర్ధనే స్పష్టం చేశాడు. తాజాగా రోహిత్ కెప్టెన్సీపై పలు విషయాలను వెల్లడించాడు.
"అతడో పట్టుదల గల నాయకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో ప్రత్యర్థులకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరిస్తాడు. అదే అతడి బలమని నేను భావిస్తున్నా. అలా సేకరించిన సమాచారాన్ని మైదానంలో ప్రయోగిస్తాడు. ఆ విషయంలో మంచి నేర్పరి."
-జయవర్ధనే, శ్రీలంక మాజీ క్రికెటర్
ఐపీఎల్‌లో రోహిత్ విజయవంతమైన సారథిగా కొనసాగుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ముంబయి ఇండియన్స్‌ను ఇప్పటివరకు నాలుగుసార్లు విజేతగా నిలబెట్టాడు హిట్‌మ్యాన్. మొత్తం 104 మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా 60 సార్లు విజయం సాధించాడు. దీంతో అతడి విజయాల శాతం 58.65తో మెరుగ్గా ఉంది.
ఈ ఏడాది ఐపీఎల్ 13వ సీజన్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయంపై అధికారికంగా ఇంకా ఎలాంటి స్పష్టతా లేకపోయినా.. ఒకవేళ అక్టోబర్-నవంబర్‌లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఆ సమయంలో దీన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ మాత్రం తన నిర్ణయాన్ని వాయిదా వేయడం వేస్తూనే ఉండటం క్రికెట్ అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తోంది.