దేశవాళీలో అతిపెద్ద సమరమైన రంజీ ట్రోఫీ.. నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. భారత అగ్రశ్రేణి క్రికెటర్ల నుంచి యువ ఆటగాళ్ల వరకు ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నారు. భారత టెస్టు క్రికెటర్లయిన చతేశ్వర్ పుజారా, పృథ్వీ షా తదితరులు ఇందులో సత్తాచాటి రానున్న విదేశీ పర్యటనల్లో రాటుదేలాలని అనుకుంటున్నారు.
![Ranji Trophy: Game time for Test specialists, opportunity and hope for rest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5311626_prithvu.jpg)
వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో విరాట్ సారథ్యంలోని టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. మళ్లీ ఫిబ్రవరి మూడో వారంలో కివీస్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లోపు తాము సన్నద్ధం కావాలని భారత టెస్టు స్పెషలిస్టులు భావిస్తున్నారు.
పుజారా(సౌరాష్ట్ర), అజింక్య రహానే(ముంబయి), మయాంక్ అగర్వాల్(కర్ణాటక), రవిచంద్రన్ అశ్విన్(తమిళనాడు) రంజీ ట్రోఫీతో మరింత పదునుగా తయారవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఉమేశ్, యాదవ్, ఇషాంత్ శర్మ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. బీసీసీఐ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
![Ranji Trophy: Game time for Test specialists, opportunity and hope for rest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5311626_ashwin.jpg)
ఇటీవల గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య.. దేశవాళీలో ఫిట్నెస్ సాధించి జాతీయ జట్టులోకి రావాలనే కుతూహులంతో ఉన్నారు. ఈ టోర్నీలో కొన్ని మ్యాచ్‌ల్లో వీరు ఆడనున్నారు.
ఈ సీజన్లో జట్ల మధ్య కంటే ఆటగాళ్ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. గ్రూప్-బిలో తమిళనాడు - కర్ణాటక మ్యాచ్ జరగనుంది. ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్‌లు ప్రత్యర్థులుగా తలపడనున్నారు. అదే విధంగా ముంబయి(రహానే) - బరోడా(పృథ్వీ షా) మధ్య మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశముంది.
ఈ రంజీ టోర్నీ.. వచ్చే ఏడాది మార్చి 13 వరకు జరగనుంది. మొత్తం 38 జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది కొత్తగా ఛండీఘడ్ కూడా ఆడనుంది.
ఇదీ చదవండి: దంచి కొట్టిన దూబే.. భారత్ స్కోరు 170/7