క్రికెట్ జట్టు ఎంపికలో స్నేహాన్ని పక్కనపెట్టి కఠినంగా ఉండాలని, ఆటగాళ్ల ప్రదర్శన బట్టే ఎంచుకోవాలని పాకిస్థాన్ మాజీ ఓపెనర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది జరగబోయే పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్లు ఇప్పటికే సరైన కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నాయని, ఆ విషయంలో పాక్ వెనకపడినట్లు అనిపిస్తోందని అన్నాడు.
"వాళ్లని చూసి పాక్ నేర్చుకోవాలి. అన్ని కోణాల్లో ఆటగాళ్లను పరీక్షించకపోతే టీ20 ప్రపంచకప్‌లో సరైన జట్టు కనిపించదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లు ఇప్పటికే పేరు పొందినా అవి ప్రయోగాలు చేస్తున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం ఇప్పటికిప్పుడే ఫలితాలు రావాలని చూస్తోంది. సరైన జట్టు కావాలంటే సెలక్టర్లు నిర్దయగా ఉండాలి. ఇమ్రాన్‌ఖాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇలాగే చేశాడు. తన చుట్టూ ఎప్పుడూ ఐదారు మంది ఆటగాళ్లు ఉండేవారు. అప్పట్లో వారికి ఇంకా రెండేళ్లు ఆడే అవకాశం ఉన్నా అందరినీ పక్కనపెట్టాడు. జావెద్ మియాందాద్ లాంటి యువకులతో జట్టును నింపాడు. అలాగే 1992 ప్రపంచకప్‌లో యువ జట్టుతోనే బరిలోకి వెళ్లాము. కాబట్టి.. జట్టు ఎంపికలో కఠినంగా ఉండాలి. సరైన ప్రణాళికలు కూడా ఉండాలి. అందరికీ కొత్త ఆటగాళ్లని ప్రోత్సహిస్తామని చెప్పాలి. ఫలితాలు అప్పుడే రాకపోయినా దీర్ఘకాలంలో అదే మంచి చేస్తుంది"
-రమీజ్ రాజా, పాక్ మాజీ క్రికెటర్
జట్టు ఎంపికలో ఆటగాళ్లు స్నేహాన్ని పక్కనపెట్టాలని, మంచి ప్రదర్శన చేసేవారినే ఎంపిక చేయాలని రమీజ్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఎవరైనా దీర్ఘకాలిక ఫలితాలను వదిలేసి తాత్కాలిక విజయాల మీదే దృష్టిపెడతారని చెప్పాడు. ఇక ఇప్పుడు పాక్ జట్టులో జరుగుతున్న విషయాలు తనకు అర్థం కావడం లేదని మాజీ బ్యాట్స్‌మన్ అసహనం వ్యక్తం చేశాడు.
ఒకవైపు బాబర్ అజామ్ లాంటి యువకుడిని కెప్టెన్‌గా చేసి మరోవైపు హఫీజ్, మాలిక్ లాంటి వయసు పైబడిన క్రికెటర్లను కొనసాగించడం ఏంటని ప్రశ్నించాడు రమీజ్. జట్టు ఎలాంటి ఆలోచనలతో ముందుకెళుతుందో తెలియడం లేదన్నాడు. ఇప్పుడు హఫీజ్ బాగా రాణిస్తున్నందున పర్వాలేదని, ఒకవేళ అతడు విఫలమైతే ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోతే అప్పుడు ఇబ్బందులు పడతారని పాక్ మాజీ ఓపెనర్ పేర్కొన్నాడు.