ఐపీఎల్ 13వ సీజన్ కోసం మరో కొత్త మైదానం సిద్ధమైంది. ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికైన గువాహటిలోని బర్సపరా స్టేడియం.. ఈసారి నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లకూ ఆతిథ్యమివ్వనుంది. ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లను ఇక్కడ నిర్వహించేందుకు బీసీసీఐ తాజాగా అనుమతిచ్చింది.
రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లు
రాజస్థాన్ రాయల్స్ తలపడే రెండు లీగ్ మ్యాచ్‌లు ఈ స్టేడియంలోనే జరగనున్నాయి. రెండో సొంత మైదానంగా దీనిని భావిస్తోంది రాజస్థాన్ యాజమాన్యం. ఏప్రిల్ 5న దిల్లీ క్యాపిటల్స్‌తో, ఏప్రిల్ 8న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లు ఈ వేదికపై జరగనున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ రెండూ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.
ఐపీఎల్-2020 ఆరంభ మ్యాచ్ వచ్చే నెల 29న వాంఖడే వేదికగా జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఈ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశ 50 రోజులుపాటు జరిగి మే 17న ముగుస్తుంది. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు, మే 24న ఫైనల్ జరగనుంది.