రాజస్థాన్ జట్టు ఈ సీజన్లో ముంబయిని రెండోసారి ఓడించింది. జైపుర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సారథి స్మిత్ అర్ధశతకంతో మెరిసిన వేళ రాజస్థాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా ఆడారు. రహానే (12) విఫలమైనా.. సంజు శాంసన్‌తో కలిసి కెప్టెన్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. శాంసన్ 35 పరుగులతో ఆకట్టుకున్నాడు.
రాణించిన స్మిత్, పరాగ్
రాజస్థాన్ సారథిగా బాధ్యతలు చేపట్టిన స్టీవ్ స్మిత్ జట్టును విజయపథాన నడిపించాడు. యువ ఆటగాడు రియాన్ పరాగ్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అర్ధశతకాన్ని సాధించాడు స్మిత్. 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రియాన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం బిన్నీతో కలిసి మిగతా పని పూర్తి చేశాడు స్మిత్.
ముంబయి బౌలర్లలో రాహుల్ చాహర్ 3 వికెట్లతో ఆకట్టుకునే ప్రదర్శన చేయగా.. బుమ్రా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
డికాక్ అర్ధశతకం.. ముంబయి 161
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ (5) విఫలమైనా.. మరో ఓపెనర్ డికాక్ (65) అర్ధశతకం సాధించాడు. చివర్లో సూర్య కుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్య (23) మెరుపులతో రోహిత్ సేన గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.
రాజస్థాన్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 2 వికెట్లతో మెరవగా, బిన్నీ, ఆర్చర్, ఉనద్కట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.