ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల జీవితాలు కాపాడటమే ముఖ్యమని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్‌శుక్లా స్పష్టంచేశారు. ప్రజల జీవితాల కన్నా ఏదీ ముఖ్యం కాదన్నారు. తాజా పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈసారి ఐపీఎల్ జరిగే అంశంపై స్పందించారు.
"ఐపీఎల్ నిర్వహణపై ఎలాంటి ఏర్పాట్లు జరగడం లేదు. ప్రభుత్వ నిర్ణయం మీదే అది ఆధారపడి ఉంది. అందుకు తగ్గట్లే నడుచుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందనే వార్తలు వింటున్నాం. ఒకవేళ ఏప్రిల్ 15న ఐపీఎల్ ప్రారంభమవుతుందని మీరు అనుకుంటే.. అలా కనిపించడం లేదు"
-రాజీవ్‌శుక్లా, మాజీ ఛైర్మన్ పేర్కొన్నారు.
షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై స్పందించిన రాజీవ్‌శుక్లా.. వాటిని తేలిగ్గా తీసుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో ఛారిటీ ఫండ్ కోసం.. భారత్, పాకిస్థాన్ జట్లు మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని పాక్ మాజీ పేసర్ సూచించాడు. ఈ విషయంపై రాజీవ్ మాట్లాడుతూ.. 'అక్తర్ హాస్యాస్పదమైన వ్యక్తని అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడూ అలాంటి సూచనలు చేస్తుంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ అంటే నేను దాన్ని సరదాగా తీసుకుంటా. మనం ఐపీఎల్‌నే నిర్వహించలేకపోతున్నాం. అలాంటిది ఆ మ్యాచ్‌ను ఎవరు చూసేందుకు వస్తారు. ఆటగాళ్లకు ఎవరు అనుమతిస్తారు' అని విమర్శించారు. భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోవని, ఇరు దేశాల్లో సరైన పరిస్థితులు లేవని రాజీవ్ గుర్తుచేశారు. అక్తర్ వ్యాఖ్యలను తాను సరదాగా తీసుకుంటానని అన్నారు.
ఇదీ చూడండి : మొన్న వంట చేసి.. ఇప్పుడు బొమ్మ గీసిన భారత క్రికెటర్