తమ పిల్లలను క్రికెటర్లుగా తీర్చిదిద్దాలని కొన్నేళ్లుగా తాము పడుతోన్న శ్రమ బూడిద పాలు అవుతోందని, తమ పిల్లల ప్రతిభను తొక్కేస్తున్నారని విజయ్ హజారే జట్టులో చోటు దక్కని క్రికెటర్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. జట్టు ఎంపికలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ శనివారం జింఖానా మైదానంలోని దాని కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. లీగ్‌ల్లో, వయసు విభాగాల్లో నిలకడగా రాణించినప్పటికీ జట్టులోకి ఎంపిక చేయలేదని వాళ్లు పేర్కొన్నారు.
మంచి ప్రదర్శన చేస్తున్న క్రికెటర్లకు న్యాయం జరగాలని ఫ్లకార్డులు పట్టుకుని తమ అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ నెల 20న ఆరంభం కానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ కోసం ఇటీవల 26 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును హెచ్‌సీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో సగం కంటే ఎక్కువ మంది ఆటగాళ్లకు ప్రతిభ లేదని, హెచ్‌సీఏ ప్రతినిధులు, క్లబ్బులకు చెందిన కుటుంబ సభ్యుల పిల్లలను, డబ్బులు ఇచ్చిన క్రికెటర్లను జట్టులోకి ఎంపిక చేస్తున్నారని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రతిభ ఉన్న తమ పిల్లలకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్ వాళ్లకు మద్దతుగా నిలిచారు.
ఇదీ చదవండి: మ్యాచ్ తర్వాత రోహిత్, రహానె ఏమన్నారంటే..?