టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని నిస్సందేహంగా అత్యుత్తమ కెప్టెన్‌గా పేర్కొనవచ్చని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. మహీ గొప్పతనానికి వ్యతిరేకంగా వాదించడం ఎంతో కష్టమని చెప్పాడు.
"ఎంఎస్ ధోనీ గురించి ప్రతికూలంగా మాట్లాడటం ఎంతో కష్టం. అతడిపై ప్రతిఒక్కరూ ఎన్నో అంచనాలను పెట్టుకుంటారు. భారత జట్టుకు సారథిగా ఎన్నో ఘనతలు అందించాడు. చెన్నె సూపర్ కింగ్స్‌ను గొప్పగా నడిపించాడు. అందుకే అతడి గురించి వ్యతిరేకంగా మాట్లాడలేం" -కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
మహేంద్ర సింగ్ ధోనీ.. భారత జట్టును రెండుసార్లు విశ్వవిజేతగా నిలబెట్టాడు. కెప్టెన్‌గా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించడం సహా 2013 ఛాంపియన్స్ ట్రోఫీని తెచ్చిపెట్టాడు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో కివీస్ చేతిలో ఓటమి అనంతరం క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు మహీ. ఐపీఎల్‌తో పునరాగమం చేయాలని భావించాడు. కానీ కరోనా కారణంగా ఈ టోర్నీ 13వ సీజన్ వాయిదా పడింది. ఈ లీగ్‌లో చెన్నైకు సారథ్యం వహించిన ధోనీ.. మూడు టైటిళ్లు అందుకున్నాడు.