పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహెసన్ మణి.. భారత్‌పై తనకున్న అక్కసును మరోసారి వెళ్లగక్కాడు. పీసీబీ మనుగడకు భారత్ అవసరం లేదని చెప్పిన కొన్ని గంటల్లోనే మరికొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కోసం ఆసియాకప్‌ను వాయిదా వేయడానికి అంగీకరించమని అన్నాడు.
కరోనా కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. ఇటీవల వాయిదా పడింది. మహమ్మారి తీవ్రత తగ్గితే సెప్టెంబర్-అక్టోబర్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే సెప్టెంబర్‌లో దుబాయ్ వేదికగా ఆసియాకప్‌నకు పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫలితంగా ధనిక క్రికెట్ లీగ్ కోసం ప్రపంచకప్‌ను వాయిదా వేయమని ఎహెసన్ చెప్పాడు.
"ఊహాగానాలు గురించి విన్నాను. ఆసియాకప్ నిర్వహణపై కేవలం భారత్, పాక్ నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. దీనిలో ఇతర దేశాలు భాగమై ఉన్నాయి. అయితే సెప్టెంబర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే ఆసియాకప్ నిర్వహించడం ఎంతో ముఖ్యం. దీని ద్వారా వచ్చే నిధులపై ఆసియా క్రికెట్ అభివృద్ధి ఆధారపడి ఉంది. అంతేకాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యదేశాలకు ఇది ఎంతో కీలకం. వచ్చే రెండేళ్ల వరకు సభ్య దేశాల క్రికెట్ అభివృద్ధికి ఆ నిధులు దోహదపడతాయి"
-ఎహెసన్ మణి, పీసీబీ ఛైర్మన్
కరోనా కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగకపోతే దేశాలు ఆర్థికంగా నష్టపోతాయని ఎహెసన్ అభిప్రాయపడ్డాడు. మెగాటోర్నీ వాయిదా పడితే ఐసీసీ నుంచి రావాల్సిన నిధులు అందక పాకిస్థాన్‌తో సహా మిగిలిన దేశాలన్నీ ఇబ్బంది పడతాయని చెప్పాడు. జూన్ నుంచి వచ్చే జనవరి వరకు ఐసీసీ నుంచి తమ దేశానికి 7-8 మిలియన్ల డాలర్లు రావాల్సి ఉంటుందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాకపోవచ్చని తెలిపాడు. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని అన్నాడు. 2023-31లో ఐసీసీ నిర్వహించే టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ ఆసక్తిగా ఉందని వెల్లడించాడు. ఐసీసీ పోటీలను నిర్వహించడానికి అంతకుముందు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు అవకాశం దక్కిందని తెలిపాడు. ఈసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోసం అన్ని దేశాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయని అన్నాడు.
ఇదీ చూడండి : 'మా మనుగడకు భారత్ సాయం అవసరం లేదు'