దిల్లీ క్యాపిటల్స్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటతీరులో ఎంతో మార్పు వచ్చిందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రియన్ లారా అభిప్రాయపడ్డాడు. గతంలో లెగ్‌సైడ్ వైపే ఎక్కువగా ఆడే వాడని, కానీ ఇప్పుడు ఆఫ్ సైడ్‌లోనూ ముచ్చటైన షాట్లతో అలరిస్తున్నాడని పేర్కొన్నాడు.
"దిల్లీ జట్టుకు పంత్ ప్రధాన ఆస్తి. అయితే అతడి ఆటలో ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. గతంలో క్రీజులోకి వచ్చిన తర్వాత లెగ్‌సైడ్ వైపే ఎక్కువగా పరుగులు సాధించేవాడు. అతడి పరుగుల్లో అధిక శాతం అక్కడి నుంచి వచ్చినవే. ఆన్‌సైడ్ వైపు ఆడటంటపై తనకి ఉన్న మక్కువకు అదే నిదర్శనం. అయితే ప్రస్తుతం అతడి ఆలోచన మారింది. ఆఫ్‌సైడ్ వైపు ఆడటంలో మెరుగవుతున్నాడు. మైదానంలో నలుమూలలా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అతడు సాధిస్తున్న పరుగులు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆటలో ఎంతో సమతూకం కనిపిస్తోంది. గతంలో అలవాటు లేని ఓవర్ ఎక్స్‌ట్రా కవర్, ఓవర్ పాయింట్ మీదుగా పరుగులు చేస్తున్నాడు. అతడి ఆటలో ఇది గొప్ప పురోగతి. అయితే ఇది బౌలర్లకు ఆందోళన కలిగించే అంశం".
-బ్రియన్ లారా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్
ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న లీగ్‌లో పంత్ రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 42.57 సగటుతో 171 పరుగులు చేశాడు. దాదాపు 140 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నాడు. కాగా4 శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో దిల్లీ జట్టు విజయాలతో దూసుకెళ్తోంది. 5 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.