భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్పై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు ఎలాంటి అభ్యతరం లేదని అభిప్రాయపడ్డాడు ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా. ఈ విషయంలో ఇమ్రాన్.. రాజకీయ పరిస్థితులతో పాటు ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నాడు. దాయాదికి ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రమీజ్ రాజా చెప్పాడు.
"ఆట పరంగా అతడికి(ఇమ్రాన్ ఖాన్) ద్వైపాక్షిక సిరీస్ విషయమై ఎలాంటి సమస్య ఉండదని వందశాతం చెప్పగలను. రాజకీయంగా మాత్రం ఇరు దేశాల మధ్య పరిస్థితులు వేరుగా ఉన్నాయి. టీమ్ఇండియాను ఆహ్వానిస్తే పాక్ ప్రజలు ఎలా స్పందిస్తారనేది మరో విషయం. భారత్ చివరగా 2004లో పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది. అలాంటిది మళ్లీ జరగాలని కోరుకుంటున్నా. దాయాది దేశంతో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు పాక్ 70-80 శాతం వరకు సిద్ధంగా ఉందని భావిస్తున్నాను" -రమీజ్ రాజా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
భారత్తో సిరీస్ నిర్వహించేందుకు గతంలో పాక్ చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ప్రపంచకప్, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రం యధావిధిగా తలపడుతూనే ఉన్నారు. ఇరుదేశాలు చివరగా గతేడాది ప్రపంచకప్లో మ్యాచ్ ఆడాయి. అందులో పాక్పై 89 పరుగుల తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. 2013 భారత పర్యటన తర్వాత వీరిద్దరి మధ్య మరో సిరీస్ జరగలేదు.
ఇదే విషయమై గతంలో స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ ఎహ్సాన్ మణి.. టీమ్ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్కు తాము ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ వెనుక పరిగెత్తమని స్పష్టం చేశారు.