రాబోయే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ టాపార్డర్‌పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని యోచిస్తున్నట్లు పాకిస్థాన్ కెప్టెన్ అజర్ అలీ తెలిపాడు. అలిస్టర్ కుక్ రిటైర్మెంట్ అనంతరం అతిథ్య జట్టులోని బ్యాటింగ్ లైనప్ దెబ్బతిందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌కు బయలుదేరే ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"ఇంగ్లాండ్ జట్టును పరిశీలిస్తే.. కుక్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి వారి టాపార్డర్ బలహీనపడింది. ఈ క్రమంలో కొంచెం స్థిరపడినట్లు కనిపించేందుకు.. వారు టాపార్డర్‌లో ఎన్నో సార్లు మార్పులు చేశారు. కానీ, ఆ లైనప్‌పై నిజంగా అంత నమ్మకంగా లేరు. కాబట్టి మాకు ఏదో అవకాశం ఉందని అనిపిస్తోంది."
-అజర్ అలీ, పాకిస్థాన్ కెప్టెన్
అయితే, ఇంగ్లాండ్ జట్టులోని జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ వంటి బౌలర్ల దాడిని ఎదుర్కోవడం చాలా కష్టమని అలీ వెల్లడించాడు. తమ బౌలింగ్ దళం కూడా బలంగానే ఉన్నట్లు గుర్తు చేశాడు. నలీమ్ షా, షాహీన్ షా అఫ్రిదీ వంటి బౌలర్లు సిరీస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
2018లో కుక్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు ఆడిన 18 టెస్టుల్లో టాపార్డర్ స్థానాల్లో ఆరు సార్లు మార్పులు జరిగాయి. రోరీ బర్న్స్ ఒక్కడే స్థిరంగా కొనసాగుతున్నాడు.
ఇక పాక్ జట్టులోని 20 మంది ఆటగాళ్లు మాంచెస్టర్‌కు చేరుకోగానే.. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. పర్యటనలోని మొత్తం ఆరు మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు.