న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ క్రికెటర్లు క్వారంటైన్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఈ సందర్భంగా కివీస్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చివరి హెచ్చరిక చేసింది.
వివరాలు చెప్పేందుకు నిరాకరణ
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పలువురు పాక్ క్రికెటర్లు నిర్బంధ నియమాలను అతిక్రమించి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆటగాళ్ల వివరాలు వెల్లడించేందుకు న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ నిరాకరించింది.
పాక్ బృందం క్రైస్ట్‌చర్చ్‌లోని పార్క్ హోటల్లో బస చేస్తోంది. మొత్తం 53 మందిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారందరికి నెగటివ్ రావడం వల్ల.. వైరస్ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
శిక్షణకు అనుమతి రద్దు
కాంటర్బరీ జిల్లా హెల్త్ బోర్డు ఆరోగ్య అధికారి పాకిస్థాన్ మేనేజ్మెంట్కు ఓ లేఖ రాశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఆటగాళ్లందరూ తమ గదుల్లోనే ఉండాలని అందులో పేర్కొన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు వారికి శిక్షణ ఇచ్చే అధికారాన్ని కూడా రద్దు చేశారు.