మ్యాచ్ ఆడకముందే ఓటమిని ఒప్పుకునేలా మాట్లాడాడు దక్షిణాఫ్రికా క్రికెట్ కోచ్, జట్టు మేనేజర్ ఎనాక్ క్వే. భారత్ పర్యటనలో సఫారీలు ఓడినంత మాత్రాన ప్రపంచమేమీ అంతం కాదని అన్నాడు.
"భారత పర్యటన మాకు పెద్ద సవాల్. అక్కడ మేం ప్రభావం చూపుతామని బలంగా నమ్ముతున్నా. ఒకవేళ ఓడినా.. ప్రపంచమేమీ అంతం కాదు. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది" - ఎనాక్ క్వే, దక్షిణాఫ్రికా కోచ్
యూరోపియన్ స్టైల్ ఫుట్‌బాల్ టీమ్ మేనేజర్ పెప్ గార్డియోలా తనకు ఆదర్శమని తెలిపాడు ఎనాక్. ఆటగాళ్ల ఎంపిక దగ్గర నుంచి అన్నీ తానై చూసుకుంటూ.. జట్టును విజయపథంలో నడిపించాడని చెప్పాడు.
ఇటీవలే ప్రొటీస్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు ఎనాక్ క్వే. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది దక్షిణాఫ్రికా. ఈ కారణంగానే కోచ్ గిబ్సన్ స్థానంలో ఎనాక్ను నియమించింది ఆ దేశ క్రికెట్ బోర్డు.
వచ్చే నెల 15న భారత్ పర్యటనను ప్రారంభించనుంది దక్షిణాఫ్రికా. ముందుగా మూడు టీ-20లు ఆడనుంది. అనంతరం మూడు టెస్టుల్లో తలపడనుంది. ఈ సిరీస్‌తోనే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఆరంభించనుంది సఫారీ జట్టు.
ఇది చదవండి: భారత మహిళా హాకీ జట్టు శుభారంభం