కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెస్టు మ్యాచ్ జరిగే సమయంలో ఎవరైనా ఆటగాడిలో కరోనా లక్షణాలు బయట పడితే అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌ను అనుమతించేందుకు అంగీకారం తెలిపింది. ఆటగాళ్లు బంతికి లాలాజలాన్ని రుద్దడంపై విధించిన మధ్యంతర నిషేధాన్ని ఆమోదించింది. ఈ మేరకు ఐసీసీ ప్రకటన వెలువరించింది.
కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లలో.. తటస్థేతర అంపైర్లను తిరిగి ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. టెస్ట్‌లలో గాయపడిన ఆటగాళ్ల స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌లను అనుమతిస్తుండగా.. తాజాగా కరోనా లక్షణాలు బయటపడిన ఆటగాడి స్థానంలో.. సబ్‌స్టిట్యూట్‌ను అనుమతించనున్నట్లు ఐసీసీ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ నిబంధనలు వన్డేలు, టీ20లకు వర్తించవని స్పష్టం చేసింది.
కోవిడ్ వ్యాప్తిని నివారిస్తూ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించేందుకు.. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ ఈ ప్రతిపాదనలు చేయగా ఐసీసీ ఆమోదం తెలిపింది.