వెటరన్ స్పిన్నర్ పీయుష్ చావ్లాపై ముంబయి ఇండియన్స్ ప్రశంసలు కురిపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడికెంతో అపారమైన అనుభవం ఉందని తెలిపింది. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పుడు కూడా అతడు కుర్రాళ్లకు చక్కగా మార్గనిర్దేశం చేయగలడని వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అతడిని ముంబయి కొనుగోలు చేసింది.
"అండర్-19 నుంచి పియూష్‌తో కలిసి ఆడాను. దూకుడైన బౌలర్. మా స్పిన్ విభాగం కోరుకుంటున్నదీ అదే. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన అతడిని వేలంలో దక్కించుకోవడం బాగుంది. ఐపీఎల్, ఫార్మాట్, ప్రత్యర్థులు, ఆటగాళ్ల గురించి అతడికి బాగా తెలుసు." అని రోహిత్ అన్నాడు.
పీయుష్ అనుభవానికి తామెంతో విలువ ఇస్తామని ముంబయి క్రికెట్ డైరెక్టర్ జహీర్ ఖాన్ అన్నాడు. యువకుడైన రాహుల్ చాహర్‌కు.. చావ్లా అనుభవం సాయపడుతుందని పేర్కొన్నాడు. అతడు నైపుణ్యంతోనే కాకుండా అనుభవం పరంగా కూడా జట్టుకు ఉపయోగపడతాడని వివరించాడు. ఒత్తిడి సందర్భాల్లో కీలక పాత్ర పోషిస్తాడని తెలిపాడు. జట్టులోని మిగతా స్పిన్నర్లందరికీ మార్గనిర్దేశం చేయగలడని స్పష్టం చేశాడు.
డిఫెండింగ్ ఛాంపియన్‌కు ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని పియూష్ అన్నాడు. కుర్రాళ్లతో కలిసి ఆడేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఐదుసార్లు విజేతైన జట్టులో భాగమవ్వడం తన అదృష్టమని వెల్లడించాడు.
"రాహుల్ చాహర్ ఆటను చూశాను. జయంత్ యాదవ్, కృనాల్‌తో కలిసి ఆడాను. మా అనుభవాలను పరస్పరం పంచుకోవడం కీలకం. ఎందుకంటే కృనాల్‌కు తెలిసినవి నాకు తెలియకపోవచ్చు. నాకు తెలిసినవి రాహుల్‌కు తెలియకపోవచ్చు. ఒకర్నొకరం అర్థం చేసుకుంటూ ముందుకెళ్లడం ముఖ్యం" అని చావ్లా అన్నాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్: తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబయి గెలిచేనా?