ఐపీఎల్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులు, సిబ్బందికి ఐదుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. దుబాయ్‌లో జరిగే 13వ ఐపీఎల్ కోసం ఒక్కరొక్కరుగా ముంబయికి చేరుకుంటున్నారు. కొందరు దేశవాళీ క్రికెటర్లు ఇప్పటికే నగరానికి రాగా, కొద్దిరోజుల్లో మరికొందరు జట్టుతో కలువనున్నారు. భారత జట్టు సభ్యులు కూడా 7-8 రోజుల్లో ముంబయికి వెళ్లనున్నారు.
జట్టు సభ్యులు నగరానికి రావడం ప్రారంభించారని, ఏ క్రీడాకారుడు కూడా వైరస్ బారిన పడకుండా కఠినమైన నియమావళిని పాటిస్తున్నామని ముంబయి ఇండియన్స్ జట్టు అధికారి తెలిపారు. "దేశవాళీ క్రికెట్లరు ముంబయికి రావడం ప్రారంభించారు. వారందరినీ 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచనున్నాం. క్వారంటైన్‌లో ఉన్నవారందరికి అన్నిరకాల సదుపాయాలు కల్పించనున్నాం" అని తెలిపారు.
భారత జట్టులోని ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచి.. అనంతరం వారికి శిక్షణ మొదలుపెట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దుబాయ్ విమానం ఎక్కేలోపు ఒక్కో ఆటగాడికి ఐదు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. "ముంబయికి వచ్చేముందే ప్రస్తుతం ఆటగాళ్లు ఉన్న నగరంలోనే రెండు సార్లు పరీక్షలకు హాజరు కావాల్సిందిగా వారిని కోరాం. ఇక్కడికి వచ్చాక మరో మూడు రౌండ్ల టెస్టులు నిర్వహిస్తాం. సహాయక సిబ్బందినీ ఇదే తరహాలో పరీక్షించనున్నాం" అని తెలిపారు.