ప్రపంచకప్ జట్టులో అంబటి రాయుడుకు చోటు దక్కకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై విమర్శలూ వచ్చాయి. దీనిపై తాజాగా స్పందించాడు ఎమ్మెస్కే. ఆ సంఘటన తనకు బాధ కలిగించిందని తెలిపాడు. 2016లో జింబాబ్వే పర్యటన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌పై దృష్టిసారించాలని అతడికి సూచించానని అన్నాడు.
"రాయుడి గురించి తీవ్రంగా ఆలోచించాను. ఆ వ్యవహారం (ప్రపంచకప్‌లో ఎంపిక చేయకపోవడం) సున్నితమైందని స్పష్టంగా చెప్పగలను. 2016 జింబాబ్వే పర్యటన తర్వాత అతడిని టెస్టుల్లో ఎంపిక చేసే అంశాన్ని మా కమిటీ పరిశీలించింది. సుదీర్ఘ ఫార్మాట్‌పై ఎందుకు దృష్టి సారించడం లేదని అతడితో నేను చర్చించాను. కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే అతడిని వన్డేల్లోకి ఎంపిక చేయడం మీకు గుర్తుండే ఉంటుంది. ఇది సరికాదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత రాయుడి శారీరక దారుఢ్యం గురించి ఎన్‌సీఏలో మేం ఒక నెల దృష్టి సారించాం. అతడికి సాయం చేశాం. అందుకు తగ్గట్టే అతడు రాణించాడు. దురదృష్టవశాత్తు అతడికి జరిగిన (ఎంపిక చేయకపోవడం) దానిపట్ల నేనూ బాధపడ్డాను".
-ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్
న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేయడమే ఎమ్మెస్కే కెరీర్లో చివరి ఎంపిక. దక్షిణాఫ్రికా సిరీస్‌కు కొత్త కమిటీనే జట్టును ఎంపిక చేస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంతకుముందే తెలిపాడు.
పదవీకాలం ముగిసిన కారణంగా మరికొన్ని రోజుల్లో ప్రసాద్, గగన్ ఖోడా సెలక్షన్ కమిటీకి దూరం కానున్నారు. వారి స్థానాల్లో కొత్తవారి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది. ముఖాముఖి నిర్వహించే క్రికెట్ సలహా కమిటీని ఎంపిక చేసింది.
ఇవీ చూడండి.. టెన్నిస్ కోర్టులో ఫెదరర్ డ్యాన్స్.. వీడియో వైరల్