ప్రస్తుతం టీమిండియా క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్పై నడుస్తున్నంత చర్చ అంతా ఇంతా కాదు. అతడు ఎప్పుడు వీడ్కోలు పలుకుతాడా అని అందరూ అనుకుంటున్నారు. ఇటీవలే జరిగిన ప్రపంచకప్ మహీకి చివరి మెగాటోర్నీ. త్వరలో జరిగే వెస్టిండీస్ పర్యటనకు అతడు వెళ్లడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో నిజమెంత..!
వెస్టిండీస్ పర్యటనకు జట్టు ఎంపిక మొదట ఈ నెల 19న అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. జులై 21న (ఆదివారం) సెలక్టర్ల కమిటీ సమావేశమై జట్టును ప్రకటిస్తుందని వెల్లడించింది బీసీసీఐ. కోహ్లీ అందుబాటులో ఉండడన్న కారణంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ధోనీ భవితవ్యం ఏంటో.. అతడిని ఎంపిక చేయాలో వద్దోననే సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం.
టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. మరి ఈ జట్టుతో పాటు ధోని ఉంటాడా? లేక యువ కీపర్ రిషభ్ పంత్‌కు అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి. 2020 టీ-20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకొని.. పంత్‌ను వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. అతడు జట్టులో సభ్యుడిగా ఉంటూనే ఓ మార్గనిర్దేశకుడిగా వ్యవహరిస్తాడని చెప్పారు.
"మహేంద్ర సింగ్ ధోని.. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లకపోవచ్చు. అతడి స్థానంలో రిషభ్ పంత్‌ను ఎంపిక చేయవచ్చు. జట్టుకు మార్గనిర్దేశకుడిగా మహీ ఉండే అవకాశం ఉంది. ధోని స్థానాన్ని భర్తీ చేసేందుకు పంత్‌కు ఇదే సరైన సమయం"
-బీసీసీఐ అధికారి
రిషభ్ పంత్‌తో పాటు దినేశ్ కార్తిక్ జట్టులో ఉంటాడని, అతడ్ని రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసే అవకాశముందని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ధోని రిటైర్మెంట్ ప్రకటించకపోవచ్చు. 2018లో ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆటగాళ్లతో మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. కాబట్టి వచ్చే ఏడాది ఈ పొట్టి లీగ్‌లో కెప్టెన్‌గా మరోసారి కనిపించనున్నాడు మహీ.
ఇది చదవండి: ట్వీట్ రేస్‌లో విన్నర్ 'భారత్ - పాక్ ప్రపంచకప్ మ్యాచ్'