2006లో టీమ్ఇండియా పాకిస్థాన్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ జట్టులోని స్టార్ బ్యాట్స్‌మెన్‌ను ఎలా ఔట్ చేసేదని మథనపడినట్లు పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆసిఫ్ చెప్పాడు. సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, ధోనీ లాంటి హేమాహేమీలతో టీమ్ఇండియా పాక్ పర్యటనకు వచ్చిన సందర్భాన్ని యూట్యూబ్ ఛానెల్లో అతడు గుర్తు చేసుకున్నాడు.
"సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, ధోనీతో కూడిన దుర్బేధ్యమైన భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను చూసి.. 'వీళ్లను ఔట్ చేయగలమా' అని నేనూ, అక్తర్ అనుకున్నాం. ఆ జట్టులో వేల పరుగులు చేసిన బ్యాట్సమెన్ ఉన్నారు. ధోనీ ఏడో స్థానంలో వస్తున్నాడంటేనే వాళ్ల బ్యాటింగ్ లోతు అర్థం అయింది. కానీ గొప్ప వేగంతో పాటు నైపుణ్యంతో బౌలింగ్ చేసిన అక్తర్ భారత జట్టుపై ఒత్తిడి పెంచాడు. అతని మెరుపు బౌన్సర్లు ఎదుర్కోవడానికి టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. కరాచీలో జరిగిన ఆఖరి టెస్టులో అతడు ఓ ఎండ్‌లో ఇలా ఒత్తిడి పెంచడం వల్లే నేను వికెట్లు తీయగలిగాను" అని ఆసిఫ్ అన్నాడు.
ఈ సిరీస్‌లో మూడో టెస్టులో మాత్రమే ఆడిన ఆసిఫ్ ఏడు వికెట్లు తీసి, పాక్ 1-0తో సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులు డ్రా అయ్యాయి.
ఇదీ చూడండి: 'ప్రస్తుతం అత్యంత తెలివైన బౌలర్ బుమ్రా'