ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలెక్టర్, హెడ్ కోచ్ ఇలా రెండు పదవులను నిర్వర్తిస్తున్నాడు ఆ దేశ మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్. ఇందువల్ల మిస్బాపై అధిక భారం పడుతోందని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అతడిని చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
"మిస్బావుల్పై అధిక భారం తగ్గించాలని బోర్డు భావిస్తోంది. అందుకే అతడిని త్వరలోనే చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పించవచ్చు. దీని వల్ల మిస్బా పూర్తిగా కోచ్ పదవిపై దృష్టి పెట్టవచ్చు. భవిష్యత్లో ఐసీసీ టోర్నీలు ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం."
-పీసీబీ అధికారి
ప్రస్తుతం ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో తలపడుతున్న పాక్ ఇప్పటికే 0-1 తేడాతో వెనకబడి ఉంది. చివరి టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. ఫలితంగా ఇంగ్లాండ్ గడ్డపై పదేళ్లుగా సిరీస్ ఓటమెరుగని పాక్ తొలిసారి ఆ పరాభవాన్ని మూటగట్టుకోనుంది. దీంతో బోర్డు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్ మేనేజ్మెంట్లో పలు మార్పులను తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం.