పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి మిస్బా ఉల్ హక్ తప్పుకున్నాడు. హెడ్ కోచ్‌గా పూర్తి దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. తాను వైదొలగడంలో ఎవరి ప్రమేయం లేదని తేల్చి చెప్పాడు.
గతేడాది సెప్టెంబరులో ఈ రెండు బాధ్యతలు స్వీకరించిన మిస్బా.. ఈ నవంబరు 30 తర్వాత కేవలం హెడ్ కోచ్‌గానే కొనసాగనున్నాడు. చీఫ్ సెలెక్టర్‌గా ఎవరు వచ్చినా సరే తన వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తానని మిస్బా చెప్పాడు.
"మూడు ఫార్మాట్లలోనూ టాప్-3లో ఉండేలా పాక్ జట్టును తయారు చేయడమే నా ప్రధాన కర్తవ్యం. రానున్న మూడేళ్లలో ప్రపంచకప్‌లు కూడా ఉన్నాయి. దాని కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాం" అని మిస్బా చెప్పాడు.
అయితే చీఫ్ సెలెక్టర్ పోస్ట్ కోసం తనను సంప్రదించారంటూ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. ఇటీవలే యూట్యూబ్ ఛానెల్లో చెప్పాడు. అయితే ఇదంతా అవాస్తవమేనని బోర్డు వెల్లడించింది.