ఐపీఎల్-2019 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కోచ్‌గా పనిచేసిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మైక్ హెసన్ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టిన హెసన్ కేవలం 10 నెలలు మాత్రమే పంజాబ్ జట్టుకు సేవల్ని అందించాడు. ఇతడి పర్యవేక్షణలో కింగ్స్ ఎలెవన్ జట్టు ఆరో స్థానంలో నిలిచింది.
"కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో కలిసి పని చేసినంత కాలం చాలా ఎంజాయ్ చేశా. ఇలాంటి బాధ్యత అప్పగించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈ ఏడాది జట్టు అనుకున్నంత రాణించకపోవడం బాధ కలిగించింది. కానీ మీకు విజయం దగ్గర్లోనే ఉంది."
-మైక్ హెసన్, కింగ్స్ ఎలెవన్ కోచ్.
పంజాబ్ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేసిన హెసన్... టీమిండియా ప్రధాన కోచ్ పదవి రేసులో ఉన్నాడు. రవిశాస్త్రితో పాటు ఆసీస్ ఆల్‌రౌండర్ టామ్ మూడీ మరికొందరితో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బంగ్లాదేశ్ కోచ్ పదవి కోసం గ్రాంట్ ఫ్లవర్, హతురుసింఘా, ఫార్‌బ్రేస్, రసెల్ డొమింగోలతో పోటీపడనున్నాడు. పాకిస్థాన్ కోచ్ పదవి నుంచి మికీ ఆర్థర్‌కు ఉద్వాసన పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పదవికీ హెసన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగానే పంజాబ్ ఫ్రాంఛైజీ బాధ్యతల నుంచి ఈ కివీస్ మాజీ ఆటగాడు తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి.. మళ్లీ ఫిక్సింగ్ కలకలం.. మన్సూర్-అక్మల్ వివాదం