దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుత శతకంతో అదరగొట్టాడు. 371 బంతుల్లో 215 పరుగులు చేశాడు. ఇందులో 23 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో మయాంక్ మరికొన్ని రికార్డులు అందుకున్నాడు.
సెహ్వాగ్ తర్వాత మయాంకే..
దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు మయాంక్. 2008 వీరేంద్ర సెహ్వాగ్ ప్రొటీస్ జట్టుపై ద్విశతకం నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ ఏకంగా 319 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన 23వ భారత ఆటగాడిగానూ మయాంక్ రికార్డు సృష్టించాడు.
నాలుగో భారత క్రికెటర్...
టెస్టుల్లో తన తొలి సెంచరీనే ద్విశతకంగా మార్చిన నాలుగో భారత క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మయాంక్. అంతకుముందు దిలీప్ సర్దేశాయ్. వినోద్ కాంబ్లీ, కరుణ్ నాయర్ ఈ ఘనత సాధించారు.
ప్రొటీస్‌పై శతకాలు చేసిన జోడీ..
దక్షిణాఫ్రికా జట్టుపై శతకాలు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా మాయంక్ - రోహిత్ శర్మ నిలిచారు. అంతేకాకుండా భారత్ - సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యం(317) నమోదు చేసిన ద్వయంగానూ ఘనత సాధించారు. అంతకుముందు గ్యారీ కిర్‌స్టెన్ - ఆండ్రూ హుడ్సన్ 1996-97 సీజన్లో 236 పరుగులు జోడించారు.
ఇది మూడోసారి..
టెస్టు క్రికెట్లో భారత ఓపెనర్లు 300 పైగా పరుగులు జోడించడం ఇది మూడో సారి. అంతకుముందు వినోద్ మన్కడ్ - పంకజ్ రాయ్ ఉన్నారు. 1955-56 సీజన్లో న్యూజిలాండ్‌పై 413 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 2005 -06లో పాకిస్థాన్‌పై సెహ్వాగ్ - ద్రవిడ్ జోడీ 410 పరుగులు సాధించింది.
సొంత గడ్డపై జరిగిన తొలి టెస్టులో శతకాలు బాదిన తొలి ఓపెనింగ్ జోడిగానూ మయాంక్ - రోహిత్ రికార్డు సాధించింది.
విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు నష్టానికి 39 పరుగులు చేసింది. అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 502/7 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ 176 పరుగులతో ఆకట్టుకున్నాడు.
ఇదీ చదవండి: డబుల్ సెంచరీతో ఆనందం డబుల్ అయింది: మయాంక్