తన కుమారుడు యువరాజ్ కెరీర్ పాడైపోవడానికి కోహ్లీ, ధోనీలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశాడు యోగ్రాజ్ సింగ్. కష్టకాలంలో అతడికి అండగా నిలవలేదని చెప్పాడు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
"యువరాజ్‌ను ఎంతో మంది వెన్నుపోటు పొడిచారు. అందులో ప్రస్తుత- మాజీ కెప్టెన్లు కోహ్లీ, ధోనీ ఉన్నారు. ఇది చాలా బాధకల్గించే అంశం.సెలక్టర్లూ అతడి కెరీర్‌ను నాశనం చేశారు. అందులో శరణ్‌దీప్.. యువీని జట్టు నుంచి తప్పించాలని చూశాడు. క్రికెట్లో ఓనమాలు తెలియని ఇలాంటి వారిని సెలక్షన్ కమిటీలో ఎలా చేర్చుకున్నారో తెలియదు" -యోగ్రాజ్ సింగ్, యువరాజ్ తండ్రి
గతేడాది ఆటకు వీడ్కోలు పలికిన యువీ.. తనకు భారత కెప్టెన్లలో ధోనీ, కోహ్లీల కన్నా గంగూలీ నుంచే ఎక్కువ మద్దతు లభించిందని అన్నాడు. అంతకు ముందు యువీ కెరీర్ విషయంలో ఎన్నోసార్లు ధోనీపై యోగ్రాజ్ ఆరోపణలు చేశాడు. 2011లో తన కొడుకును కాదని రైనాను జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నించాడని, యువరాజ్ రాణిస్తే తమకు పేరు రాదనే ఉద్దేశంలో మహీ, కోహ్లీలు అతడి పట్ల వివక్ష చూపేవారని పేర్కొన్నాడు.