42ఏళ్ల వయసులో లియాండర్ పేస్.. గ్రాండ్ స్లామ్ గెలిచినపుడు, 36 ఏళ్ల వయసులో ఉన్న తన ఆటపై అనుమానాలు ఎందుకని క్రికెటర్ శ్రీశాంత్ ప్రశ్నించాడు. తనలో ఇంకా ఆట మిగిలే ఉందని స్పష్టం చేశాడీ భారత బౌలర్.
శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేయాలని బీసీసీఐని సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవిత కాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడీ బౌలర్.
సుప్రీం నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందని అనుకుంటున్నా. దేశ సర్వోన్నత న్యాయస్థానం క్రికెట్ ఆడేందుకు నాకు అనుమతిచ్చింది. ఆటకు వయసు సమస్య కాదు. చీకటి రోజుల్లో భరోసా ఇచ్చిన నా తల్లిదండ్రులకు, అభిమానులకు ధన్యవాదాలు.
---శ్రీశాంత్, భారత క్రికెటర్
ఇప్పటికీ కొందరు ఆటగాళ్లు నాతో టచ్లో ఉన్నారని... హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనాతో తరచూ మాట్లాడుతూ ఉంటానని తెలిపాడు. ఊతప్ప చాలా సన్నిహిత మిత్రుడని పేర్కొన్నాడీభారత ఫాస్ట్ బౌలర్.
భారత జట్టు తరపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్ లు ఆడాడు శ్రీశాంత్. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.