మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్... భారత్ టెస్ట్ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లాగే.. మయాంక కూడా నిర్భయంగా బ్యాటింగ్ చేశాడన్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఒకేలా బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడని అభిప్రాయపడ్డాడు.
"మయాంక్ స్థిరమైన బ్యాట్స్‌మన్. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ను దేశవాళీలా ఆడాడు. ఆటగాళ్లు సాధారణంగా దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులకు బ్యాటింగ్ శైలిని మారుస్తారు. కానీ అతడు రెండింటిలోనూ ఒకేలా ఆడాడు. మానసికంగా దృఢంగా ఉండటం, స్థిరంగా ఆడటం మయాంక్ బలాలు. తన అభిమాన క్రికెటర్ సెహ్వాగ్ లాగే భయం లేకుండా ఆడాడు" -వీవీఎస్ లక్ష్మణ్
అరంగేట్రంలో వరుస అర్థశతకాలు, సొంతగడ్డపై ద్విశతకంతో జట్టులో మయాంక్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని చెప్పాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.
"ఏళ్ల తరబడి దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం మయాంక్‌కు ఫలితాల్నిస్తోంది. మయాంక్ తన కాళ్లను అద్భుతంగా ఉపయోగిస్తాడు. ముందుకొచ్చి బంతిని బాదుతాడు. రివర్స్ స్వీప్‌ను పక్కాగా ఆడతాడు. అతడి బుర్రలో ఎన్నో టెక్నిక్‌లు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అక్కడ అదే వాడతాడు. రోహిత్ భిన్నంగా ఆడేందుకు ప్రయత్నిస్తే మయాంక్ తన సొంత శైలికే కట్టుబడ్డాడు" -హర్భజన్ సింగ్, మాజీ క్రికెటర్.
విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ 215 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(176, 127) రెండు శతకాలతో ఆకట్టుకున్నాడు.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్ జట్టు ప్రధాన కోచ్‌గా సిల్వర్‌వుడ్