భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఆధ్వర్యంలో టీమిండియా నూతన కోచ్ ఎంపిక ప్రక్రియ జరగనుంది. అతడి అధ్యక్షతన తాత్కాలిక 'క్రికెట్ సలహా కమిటీ'(సీఏసీ)నియమించి ఈ నియామకాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది బీసీసీఐ పాలకమండలి.
తాత్కాలిక ప్యానెల్...
తాత్కాలిక 'సీఏసీ' ప్యానెల్లో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, అన్షుమాన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి సభ్యులు. ఈ ముగ్గురే డిసెంబర్లో భారత మహిళా జట్టు కోచ్‌గా డబ్ల్యూ.వీ రమణ్‌ను నియమించారు. పురుషుల జట్టుకు నూతన కోచ్ ఎంపిక చేసేందుకు మళ్లీ వీరినే బీసీసీఐ సంప్రదించినట్లు తెలుస్తోంది.
సచిన్, గంగూలీ, లక్ష్మణ్ స్థానంలో...
గతంలో 'సీఏసీ' ప్యానెల్లో సభ్యులుగా మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఉండేవారు. అయితే ఈ ముగ్గురూ 'పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన' కింద రెండు పదవుల్లో ఉండకూడదని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగా ముగ్గరూ ప్యానెల్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం బీసీసీఐ పాలకమండలి కొత్తగా తాత్కాలిక ప్యానెల్‌ను కపిల్ నేతృత్వంలో ఏర్పాటు చేసి... కొత్త కోచ్ నియామకం చేపట్టే యోచనలో ఉంది.
అయితే గతంలో జాతీయ మహిళా జట్టులో ఎంపిక రాజ్యాంగ బద్ధంగా జరగలేదని ఆరోపించింది డయానా. పూర్తిస్థాయిలో ఉన్న సీఏసీ ప్యానెల్ మాత్రమే సెలక్షన్ ప్రక్రియ చేయాలని తాత్కాలిక కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
సుప్రీం ఆదేశం...
భారత క్రికెట్ జట్టు నియామకాల్లో పారదర్శకత తెచ్చేందుకు సుప్రీం కోర్టు... పరిపాలకుల కమిటీ(సీఓఏ) ఏర్పాటును సూచించింది. ఇందులో మొదట ఇద్దరు సభ్యులతో కూడిన ప్యానెల్ ఉండేది. దీనిలో ఛైర్మన్‌గా వినోద్ రాయ్, భారత మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ సభ్యులు. ఫిబ్రవరిలో లెఫ్ట్‌నెంట్ జనరల్ రవి తోడ్గేను మూడో వ్యక్తిగా నియమించింది ప్రభుత్వం.
సరికొత్తగా నోటిఫికేషన్...
టీమిండియా ప్రధాన కోచ్, సహాయక బృందానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్తగా విడుదల చేసిన నోటిఫికేషన్లో వయసు, అనుభవం నిబంధనలు విధించింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్లు అంతర్జాతీయ అనుభవం ఉండాలని, వయసు 60 ఏళ్లకు మించరాదని స్పష్టం చేసింది.
ప్రధాన కోచ్ సహా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌లు, ఫిజియో థెరపిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పదవులకు నియామకాలు చేపట్టనుంది భారత క్రికెట్ బోర్డు. జులై 30 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించింది.