అది 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై భారత్ తలపడేందుకు సిద్ధమైన సమయం. బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రత్యర్థి బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. అప్పటికే ఐదు వికెట్లు పడ్డాయి. ఇక మ్యాచ్ అయిపోయిందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆటగాడు.. ఆకలితో ఉన్న సింహంలా దూసుకొస్తున్న బంతులపై విరుచుకుపడ్డాడు. కుదిరితే ఫోర్, లేదంటే సిక్సర్లతో చెలరేగిపోయాడు. అతనెవరో కాదు.. అప్పటి టీమ్ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్.ఆ మ్యాచ్‌లో 17 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును.. తన అసాధారణ పోరాటంతో కపిల్ ఆదుకున్నాడు. 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతటి మేటి ఇన్నింగ్స్‌కు గురువారం (జూన్ 18)తో 37 ఏళ్లు పూర్తయ్యాయి.
అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్ అది..
"ఉన్నత స్థాయి క్లాస్ ఆటతీరుతో కపిల్ అదరగొట్టాడు. నేను చూసిన వాటిల్లో అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్ అదే. ఆ ఇన్నింగ్స్ కేవలం మ్యాచ్‌నే కాదు భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. అప్పటి నుంచి వన్డే క్రికెట్లో బ్యాటింగ్ చేసే విధానం మారింది. బీబీసీ సిబ్బంది సమ్మె కారణంగా ఆ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు లేకపోవడం దురదృష్టకరం."
- సునీల్ గావస్కర్
అప్పుడు స్నానం చేస్తున్నా..
"భారత్ బ్యాటింగ్ మొదలయ్యాక నేను స్నానం చేయడానికి వెళ్లా. వికెట్లు పడుతున్న సంగతి నాకు తెలీదు. ఎవరో వచ్చి బాత్రూమ్ తలుపు గట్టిగా కొట్టారు. భారత్ అప్పటికే మూడు వికెట్లు కోల్పోయిందని చెప్పారు. వెంటనే బయటకు వచ్చా. మరో వికెట్ కూడా పడటం వల్ల క్రీజులోకి వెళ్లా. పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్నా. నా ఆటను ఆస్వాదిస్తూ బ్యాట్‌ను ఝుళిపించా. దేవుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావించి పరుగులు సాధించా." అంటూ కపిల్ ఆ మరపురాని ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చారు.
జింబాబ్వేతో ఆడిన మ్యాచ్‌లో కపిల్‌తో పాటు అజేయంగా నిలిచిన భారత మాజీ క్రికెటర్ సయ్యద్ కీర్మాణి ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ.. కపిల్ ఆడిన తీరు అద్భుతమని చెప్పారు. బంతి ఎక్కడ వేయాలో బౌలర్లకు అంతు చిక్కేది కాదని పేర్కొన్నారు.
"కపిల్ ఇన్నింగ్స్ మరపురానిది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అతను అనూహ్య రీతిలో చెలరేగాడు. అలాంటి ఇన్నింగ్స్‌ను నేనెప్పుడూ చూడలేదు. బంతి ఎక్కడ వేయాలో ప్రత్యర్థి బౌలర్లకు అంతుచిక్కలేదు. కుదిరితే ఫోర్ లేదంటే సిక్సర్ అన్నట్లుగా కపిల్ బాదుడు కొనసాగింది".
- సయ్యద్ కీర్మాణి
రికార్డులు కొల్లగొట్టాడు..
- అప్పటికీ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కపిల్‌దే. ఆ తర్వాత ఏడాది వివ్ రిచర్డ్స్(189) దాన్ని బద్దలు కొట్టాడు.
- బ్యాటింగ్ ఆర్డర్లో ఆరు అంతకంటే తక్కువ స్థానాల్లో బరిలో దిగిన ఓ బ్యాట్స్‌మన్ వన్డేల్లో చేసిన అత్యధిక స్కోరు అదే. ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ప్రపంచకప్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగి 150కిపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కపిల్.
- ఇప్పటికీ ఓ పూర్తి వన్డే ఇన్నింగ్స్‌లో జట్టు స్కోరులో అత్యధిక శాతం పరుగులు చేసిన భారత ఆటగాడిగా కపిల్ అగ్రస్థానంలో ఉన్నాడు.