గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ గెలిచింది. ఈ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచింది. అయితే ఇందులో తాను సాధించిన మెడల్.. ప్రస్తుతం కనిపించట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్. ఇల్లు మారే సమయంలో ఎక్కడో మిస్ అయిందని అన్నాడు. శనివారం రాత్రి బీబీసీ రేడియోతో జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వెల్లడించాడు.
"ఎంతో విలువైన ఆ పతకాన్ని ఇంట్లో వేలాడదీశాను. ఇటీవలే కొత్త ఇంటికి మారే సమయంలో అది ఎక్కడో పోయింది. ప్రస్తుతం దానితో దిగిన ఫొటో మాత్రమే ఉంది. పతకం కోసం ఇప్పటికే చాలాసార్లు వెతికా. ఒకటి మాత్రం చెప్పగలను. అది ఇంట్లోనే ఎక్కడో ఉంది" -జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్
2019 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆర్చర్.. అభిమానుల మనసుల్ని గెల్చుకున్నాడు. కివీస్‌తో జరిగిన ఫైనల్లో సూపర్‌ఓవర్ బౌలింగ్ చేసి, తమ జట్టు తొలిసారి కప్పు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతడు.. టోర్నీ నిరవధిక వాయిదా పడటం వల్ల ఇంట్లోనే ఉంటున్నాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానుల్ని పలకరిస్తున్నాడు.