వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో గెలిచిన టీమిండియా.. 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కెప్టెన్ కోహ్లీ తన వన్డే కెరీర్లో 43వ సెంచరీ నమోదు చేయగా, శ్రేయస్ అయ్యర్ అర్ధశతకంతో రాణించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్.. సహచర బ్యాట్స్‌మెన్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇలానే ఆడితే భారత్‌కు మిడిలార్డర్ సమస్య తీరినట్లేనని, స్థానం సుస్థిరం చేసుకుంటాడని అన్నాడు.
"రెండు వన్డేల్లోనూ అయ్యర్‌తో కలిసి బ్యాటింగ్ చేశాను. ఏ మాత్రం బెదిరిపోకుండా చాలా నమ్మకం, కచ్చితత్వంతో ఆడుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు చాలా చక్కగా తన పాత్ర నిర్వర్తిస్తున్నాడు. ఇలానే ఆడితే భారత మిడిలార్డర్లో రెగ్యులర్ బ్యాట్స్‌మెన్‌గా స్థానం సుస్థిరం చేసుకుంటాడు". -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
చాలా ఏళ్లుగా మిడిలార్డర్లో సరైన బ్యాట్స్‌మెన్ దొరక్క ఇబ్బంది పడుతోంది కోహ్లీసేన. ఎంతోమందిని పరీక్షించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం శ్రేయస్ బ్యాటింగ్ చూస్తుంటే దీనికి పరిష్కారం దొరికిందనిపిస్తోంది.
"ఆట రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఒత్తిడిని మొత్తం అయ్యర్ తీసేసుకున్నాడు. అప్పుడు నేను నాదైన రీతిలో చివరివరకు స్వేచ్ఛగా ఆడగలిగాను. నేను తొలినాళ్లలో ఎలా ఉండేవాడినో ఇప్పుడు శ్రేయస్ అలా ఆడుతున్నాడు. వచ్చిన అవకాశాన్ని అందుకుంటూ జట్టుకు ఉపయోగపడుతూ, విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు". -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
టీట్వంటీ, వన్డే సిరీస్‌లు గెల్చుకున్న కోహ్లీసేన విండీస్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే తొలి టెస్టు ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది.
ఇది చదవండి: మాస్టర్ మాట: 'బాల భారతమే భాగ్య భారతం'