ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఐపీఎల్‌లో రాణించడం ఎంఎస్ ధోనీకి కష్టమేనని మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ అన్నారు. దేశవాళీ క్రికెట్ ఆడితేనే అతడి దేహం మాట వింటుందని పేర్కొన్నారు. కొన్నాళ్ల క్రితమే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న కపిల్ తాజాగా మీడియాతో మాట్లాడారు.
"కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడాలని ధోనీ నిర్ణయించుకుంటే అతడు రాణించడం చాలా కష్టం. వయసు గురించి మాట్లాడటం సరికాదు. కానీ ఈ వయసు (39 ఏళ్లు)లో ఎంత ఎక్కువగా ఆడితే అంతగా తన శరీరం సహకరిస్తుంది. ఏడాదిలో పది నెలలు క్రికెట్ ఆడకుండా హఠాత్తుగా రెండు నెలలు ఐపీఎల్ ఆడితే ఏం జరుగుతుందో మీరు చూశారు. ఎక్కువ క్రికెట్ ఆడితేనే ఒక్కోసారి రాణించడం కష్టంగా ఉంటుంది. క్రిస్ గేల్‌కు ఏం జరిగిందో మీకు తెలుసు. అందుకే ధోనీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ వైపు తిరిగి వెళ్లాలి."
-కపిల్ దేవ్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై.. అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అప్రతిష్ఠ మూటగట్టుకుంది. 2019లో వన్డే ప్రపంచకప్ ఆడిన తర్వాత ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఆడిన ధోనీ 14 మ్యాచుల్లో కేవలం 200 పరుగులే చేశాడు. ఒక్క అర్ధశతకం చేయలేదు. దీంతో ఇతడి ప్రదర్శనపై విమర్శలూ వచ్చాయి.