దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా విజయపరంపర కొనసాగిస్తోంది. మొదటి వన్డేలో విజయం సాధించిన భారత-ఏ జట్టు.. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది.
వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్ తడిగా ఉన్నందున మ్యాచ్‌ను 21 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేశారు. జియార్జే లిండే (52) అర్ధసెంచరీతో రాణించగా, సారథి బవుమా 42 పరుగులతో ఆకట్టుకున్నాడు.
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 55 పరుగులతో చెలరేగాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అన్మోల్ప్రీత్ సింగ్ (30), కృనాల్ పాండ్య (23*) ఫర్వాలేదనిపించారు. ఈ విజయంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది భారత్ ఏ జట్టు.