ఏడాది సమయమిచ్చి సెలెక్టర్లు టీమ్‌ఇండియాలోకి ఎంపిక చేస్తామంటే, మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా సురేశ్ రైనాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌చాట్‌లో మాట్లాడిన పఠాన్ మనసులోని మాటను వెల్లడించాడు. నిజంగా అలా జరగాలంటే సరైన సంప్రదింపులు అవసరమని ఇర్ఫాన్ అన్నాడు.
"సెలెక్టర్లు వచ్చి "ఇర్ఫాన్ నువ్వు రిటైరయ్యావు కానీ.. ఏడాదిలో సన్నద్ధమైతే మళ్లీ టీమ్‌ఇండియాకు ఎంపిక చేస్తాం" అని చెబితే, అప్పుడన్నీ వదిలేసి ఆటమీదే దృష్టిసారిస్తా. మనస్ఫూర్తిగా దానిమీదే ధ్యాసపెట్టి, తీవ్రంగా కష్టపడతా. కానీ, అలా మాట్లాడేదెవరు?" అని రైనాతో అన్నాడు.
"నీక్కూడా ఆర్నెల్లు సమయమిచ్చి ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తామంటే నువ్వు సన్నద్ధమవ్వవా?" అని రైనాను అడగ్గా.. అతను కూడా "కచ్చితంగా దాని మీదే దృష్టిపెడతా" అని చెప్పాడు.
ఇర్ఫాన్ 2003లో 19 ఏళ్ల వయసులో టీమ్‌ఇండియాకు ఎంపికై ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడాడు. తర్వాత పాకిస్థాన్‌పై టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి ప్రత్యేక గుర్తింపు పొందాడు. మొత్తంగా 29 టెస్టులాడిన మాజీ పేసర్ 100 వికెట్లు తీశాడు. అలాగే 120 వన్డేల్లో 173 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తోనూ పలు సందర్భాల్లో మంచి పరుగులు సాధించాడు. 2012లో చివరిసారి టీమ్‌ఇండియాకు ఆడిన ఇర్ఫాన్ తర్వాత జమ్మూ కశ్మీర్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో కొనసాగాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.