ఈ ఏడాది భారత్‌లో నిర్వహించనున్న టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల బయోసెక్యూర్ నిబంధనలు రూపొందించడానికి.. రానున్న ఐపీఎల్ దోహదపడుతుందని తెలిపింది. కొవిడ్ వల్ల ఇటీవల వాయిదా పడిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీసీఎల్) కూడా తమను అప్రమత్తం చేసిందని పేర్కొంది.
పీసీఎల్‌లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. టోర్నీ నిర్వహణ కంటే ఆటగాళ్ల ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇచ్చిన బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
''ప్రస్తుత కొవిడ్ కఠిన పరిస్థితులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ద్వైపాక్షిక సిరీస్ అయితే రెండు జట్ల ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. వారికి అర్థమయ్యేలా చెప్పొచ్చు. అదే ప్రపంచ కప్ అంటే 16 దేశాల నుంచి 16 టీమ్‌లు వస్తాయి. అప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 సిరీస్‌లను గమనించాలి. రానున్న ఐపీఎల్లో బీసీసీఐ ఏయే కొవిడ్ నిబంధనలు పాటించబోతుందనేది చూడాలి. ఇవన్నీ టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ రూపొందించే.. కరోనా ప్రోటోకాల్స్‌లో తోడ్పడతాయి.''
- మను సాహ్నీ, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. టోర్నీ వేదికలు ప్రకటించాల్సి ఉంది.
"16 దేశాలకు చెందిన ఆటగాళ్లకు విభిన్న కొవిడ్ నిబంధనలు ఉంటాయి. వీరందరినీ ఒక దేశంలోకి తీసుకొచ్చి టోర్నీ నిర్వహించాలంటే చాలా సవాలుతో కూడుకున్నదనే చెప్పాలి. ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్ని సవ్యంగా జరుగుతాయనేది చెప్పలేం. ఈ విషయాలన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి." అని సాహ్నీ తెలిపారు.
ఇదీ చదవండి: సన్నీ క్రికెట్ అరంగేట్రానికి అర్ధ శతాబ్దం పూర్తి