మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వం అద్భుతమని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రశంసించాడు. అతడి సారథ్యంలో తమ ఆటతీరు మెరుగుపడుతుందని చాలామంది క్రికెటర్లు భావిస్తారని తెలిపాడు. ఈ సీజన్‌లో ధోనీసేన (చెన్నై సూపర్ కింగ్స్) తరఫున ఆడుతున్న మొయిన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు.
"మహీ సారథ్యంలో ఆడిన క్రికెటర్లతో నేను మాట్లాడాను. తమ ఆటతీరును అతడెలా మెరుగుపరిచాడో వారు నాకు చెప్పారు. కేవలం గొప్ప నాయకులే అలా చేస్తారని నా నమ్మకం. ధోనీ నేతృత్వంలో ఆడాలని ప్రతి ఆటగాడి కోరికల జాబితాలో ఉంటుంది. ఎందుకంటే అతడలాంటి ఆత్మవిశ్వాసం, స్పష్టతను ఇస్తాడని అనుకుంటున్నా. అందుకే అతడి వద్ద ఆడేందుకు నేనెంతో ఆత్రుతగా ఉన్నా. ప్రశాంతంగా ఉండే బలమైన నాయకత్వం, కోచ్‌లు ఉండటం అత్యంత కీలకం."
-మొయిన్ అలీ, ఇంగ్లాండ్ క్రికెటర్.
"బలమైన నాయకులు, కోచ్‌లు ఒత్తిడి లేకుండా చేస్తారు. ఆటగాళ్లు నిలకడగా ఆడేందుకు తోడ్పడ్తారు. అలాంటి జట్టు యాజమాన్యం మాకున్నందుకు సంతోషంగా ఉంది. పోటీలో గెలిచేందుకే సీఎస్‌కేలో ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడున్న వారితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా" అని మొయిన్ తెలిపాడు.
గత సీజన్‌లో బెంగుళూరుకు ఆడిన ఈ ఆల్‌రౌండర్‌ను.. ప్రస్తుతం సీఎస్కే భారీ మొత్తానికి దక్కించుకుంది. 'ఇతర జట్లు సీఎస్‌కేకు తేడా ఏంటంటే ప్రతి విషయంలో ఒక పద్ధతి ఉండటం. ఆటగాళ్లు ఏం చేయాలో స్పష్టత ఉంటుంది. ఈ ఫ్రాంచైజీ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఊరికే భయపడరు' అని అలీ పేర్కొన్నాడు. ఏప్రిల్ 10న తన తొలి మ్యాచ్‌లో దిల్లీతో తలపడనుంది చెన్నై.
ఇదీ చదవండి: ఆర్చర్ చేతి వేలిలో గాజుముక్క తొలగించిన వైద్యులు