ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 భవితవ్యం ఏప్రిల్ 15 తర్వాత తేలుతుందని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగానే ఏదైనా జరుగుతుందని వెల్లడించారు. క్రికెట్ పర్యవేక్షణ కోసం బీసీసీఐ ఉందని, ఐపీఎల్ సంగతిని అదే చూసుకుంటుందని పేర్కొన్నారు.
" పరిస్థితులను బట్టి ఏప్రిల్ 15 తర్వాత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. బీసీసీఐ ప్రత్యేక సంఘం. క్రికెట్ ఒలింపిక్ క్రీడా కాదు కాబట్టి దాని సంగతి అది చూసుకుంటుంది. టోర్నీలు జరగాలా వద్దా అన్నది కాదిక్కడ ప్రశ్న. లక్షల మంది హాజరవుతారు కాబట్టి ప్రజల సంక్షేమం గురించే అసలు ప్రశ్న"
-- కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడల మంత్రి
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కేంద్రం అన్ని క్రీడా సంఘాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. జనాలు గుమిగూడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ను ఏప్రిల్ 15కు బీసీసీఐ వాయిదా వేసింది. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు ప్రస్తుతానికి రద్దయ్యాయి.