క్రికెటర్ సురేశ్ రైనాను ఒక కొడుకులా చూసుకున్నానని చెన్నై సూపర్‌కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ అన్నారు. జట్టులో అతడి పునరాగమనంపై మాత్రం తాను నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాలన్నీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సీఈవో కాశీ విశ్వనాథనే చూసుకుంటారని పేర్కొన్నారు. తమకు జట్టే సొంతమని ఆటగాళ్లు కాదని స్పష్టం చేశారు.
"ఒక కొడుకులా రైనాను చూసుకున్నా. చెన్నై సూపర్‌కింగ్స్ ఇంత విజయవంతం అయ్యిందంటే.. క్రికెట్ సంబంధ వ్యవహారాల్లో ఫ్రాంచైజీ తలదూర్చకపోవడమే కారణం. 1960 నుంచే ఇండియా సిమెంట్స్ క్రికెట్‌ను నడుపుతోంది. నేనెప్పుడూ అలాగే ఉంటా"
-- శ్రీనివాసన్, సీఎస్కే ఫ్రాంఛైజీ యజమాని
ఈ ఐపీఎల్ ఆడేందుకు రైనా మళ్లీ దుబాయ్ వస్తాడా అని ప్రశ్నించగా.. రైనా పునరాగమనం తన పరిధిలో లేని అంశమని చెప్పుకొచ్చారు శ్రీనివాసన్.
"రైనా వస్తాడా లేదా అన్నది నా పరిధిలో లేని అంశం. వాటిని నేను చూసుకోను. మాకు జట్టు ఉంది. ఫ్రాంచైజీ మాత్రమే మా సొంతం. క్రికెటర్లు కాదు. నేనేమీ క్రికెట్ జట్టు సారథి కాను. ఎవరు ఆడాలి? వేలంలో ఎవరిని తీసుకోవాలి? వంటివి చెప్పను. మాకు అత్యుత్తమ కెప్టెన్ ఉన్నాడు. అలాంటప్పుడు క్రికెట్ వ్యవహారాల్లోనే నేనెందుకు జోక్యం చేసుకువాలి?" అని శ్రీనివాసన్ ప్రశ్నించారు.
వ్యక్తిగత సమస్యలతో ఐపీఎల్-2020కి సురేశ్ రైనా దూరమైన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీనివాసన్ అతడిపై తీవ్రంగా విమర్శలు చేశారు. విజయగర్వం తలకెక్కకూడదని మందలించారు. అయితే ఆ తర్వాత మెత్తబడ్డారు. చెన్నై సూపర్‌కింగ్స్ అంతా ఒక కుటుంబమని, అతడికి అండగా ఉంటామన్నారు. మీడియా తన మాటలను వక్రీకరించిందని యూటర్న్ తీసుకున్నారు.
కుటుంబం కోసమే భారత్‌కు వచ్చానని, శ్రీని తనను కొడుకులా చూసుకున్నారని, మళ్లీ దుబాయ్‌కి వెళ్లినా ఆశ్చర్యం లేదని రైనా బుధవారం పేర్కొనడం గమనార్హం.
ఇదీ చూడండి: