వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ గెలిచి జోరుమీదున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ. పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. ఇతడి స్థానంలో శార్దుల్ ఠాకుర్‌కు చోటు లభించనుంది.
![shardul replaece bhuvi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5364693_shar.jpg)
యాజమాన్యానికి ఫిర్యాదు..!
విండీస్‌తో నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని బీసీసీఐ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు భువీ. ఇటీవలే వెన్ను నొప్పి వల్ల మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. కోలుకుని ఒక సిరీస్ ఆడాడో లేదో మళ్లీ గాయం తిరగబెట్టింది. మున్ముందు కీలక సిరీస్‌లు సహా టీ20 ప్రపంచకప్ ఉండటం వల్ల అతడిని కరీబియన్లపై ఆడించే సాహసం చేసే అవకాశం లేదని సమాచారం.
![indian pacer Bhuvneshwar Kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5364693_bhuvi2.jpg)
గాయాలతోనే సగం...
రెండేళ్లుగా భువీ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత అతడు టెస్టు సిరీస్‌లు ఆడలేదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లకు అందుబాటులో లేడు. ఆ తర్వాత కోలుకొని జట్టులోకి వచ్చినా అంతగా ప్రభావం చూపించలేదు.
2019 వన్డే ప్రపంచకప్‌లో పాక్ మ్యాచ్‌లో గాయపడినా టోర్నీలో కొనసాగాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లు ఆడలేదు. మూడు నెలల విరామం తర్వాత విండీస్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. తాజాగా మళ్లీ అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేయడం వల్ల ఇతడికి విశ్రాంతి నివ్వచ్చని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.