మహిళల టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో సెమీస్‌కు చేరింది టీమిండియా. శ్రీలంకతో చివరి లీగ్ మ్యాచ్ నేడు(శనివారం) ఆడనుంది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్న లంక... ఈ నామమాత్రపు మ్యాచ్‌లోనైనా గెలవాలని కోరుకుంటోంది. గత మ్యాచ్‌ల్లో విఫలమైన భారత బ్యాటర్లు.. ఈ రోజైనా పూర్తి స్థాయిలో రాణించాలని భావిస్తున్నారు.
భారత్ జట్టులో ఓపెనర్ షెఫాలీ వర్మ మినహా ఏ బ్యాట్స్‌ఉమెన్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. లంకతో మ్యాచ్ ఎలా ఆడినా.. సెమీస్‌లో మెరుగైన బ్యాటింగ్ చేయడం అవసరం. లేని పక్షంలో భంగపాటు ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లపై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ల్లో ఓపెనర్ షెఫాలీ మెరిసినా, టీమిండియా తక్కువ స్కోర్లే చేసింది. బౌలర్లు సమష్టిగా చెలరేగి జట్టుకు విజయాల్ని అందించారు.
ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్, వేదాకృష్ణమూర్తి.. తమ బ్యాట్లకు పనిచెప్పాల్సిన అవసరముంది. స్పిన్నర్లు పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీరికి తోడు పేసర్ శిఖా పాండే కీలకంగా మారింది.