బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా... వచ్చే నెలలో కరీబియన్ ఆటగాళ్లతో తలపడనుంది. డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది కోహ్లీ సేన. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)షెడ్యూల్‌నూ రూపొందించింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి భారత్-విండీస్ జట్లు. డిసెంబర్ 22వ తేదీతో పర్యటన ముగియనుంది.
రోహిత్‌కు విశ్రాంతి...
బంగ్లాదేశ్‌తో మూడు టీ20 సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతినిచ్చింది టీమిండియా. డిసెంబరులో జరగనున్న వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మకు విశ్రానిచ్చే అవకాశముంది. ఈ నెల 21న (గురువారం) ముంబయిలో యాజమాన్యం సమావేశం కానుంది. ఆ సమయంలో ఆటగాళ్ల పనిభారం గురించి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.
ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు 60 మ్యాచ్‌లు ఆడాడు రోహిత్. ఇందులో 16 ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండగా.. మిగిలినవి టీ20లు, వన్డేలు, టెస్టులు ఉన్నాయి.
బుమ్రా దూరమే..
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు వెన్నుగాయంతో బాధ పడిన బుమ్రా... రెండు నెలలుగా చికిత్స తీసుకుంటూ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. త్వరలో జరగనున్న విండీస్ పర్యటనకూ ఈ స్పీడ్‌స్టర్ అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే వచ్చే ఏడాది జనవరిలో మాత్రం కచ్చితంగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
ప్రపంచకప్ తర్వాత ఏ సిరీస్‌ల్లో ఆడని ధోనీ... ఈ మ్యాచ్‌లకు సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండకపోవచ్చు.
ఇవే వేదికలు...
భారత్, వెస్టిండీస్ మధ్య డిసెంబరు 6న వాంఖడే వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. 8న తిరువనంతపురంలో రెండో టీ20 నిర్వహించనున్నారు. ఆఖరి టీ20 మ్యాచ్ డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. డిసెంబరు 15న చెన్నై వేదికగా తొలి వన్డే.. 18న విశాఖపట్నం వేదికగా రెండో వన్డే, ఆఖరి వన్డే కటక్‌లో 22న నిర్వహించనున్నారు. టీ20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుండగా.. వన్డేలు మధ్యాహ్నం 2 నుంచి మొదలుకానున్నాయి.