విరాట్ కోహ్లీ... ప్రపంచ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో ప్రస్తుతమున్న అత్యుత్తమ బ్యాట్స్‌మన్. భారత్ నుంచి గొప్ప టెస్టు కెప్టెన్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 4 పరుగుల నుంచి ప్రస్థానం ప్రారంభించి.. నిరంతర సాధన, ఆటమీద మక్కువతో 254* పరుగుల వ్యక్తిగత మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎందరో దిగ్గజాల సరసన చేరిన ఈ ఆటగాడు.. తాజాగా టెస్టుల్లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు.
టెస్టుల్లో బ్రాడ్‌మన్, సచిన్, గంగూలీ, రికీ పాంటింగ్ వంటి ఎందరో దిగ్గజ క్రికెటర్ల రికార్డులను అధిగమించాడు కోహ్లీ. స్మిత్, రోహిత్ వంటి మరెందరికో తనదైన రీతిలో పోటీనిస్తున్నాడు.
'డబుల్' స్కోరర్..
విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంతకుముందు శ్రీలంకపై చేసిన 243 పరుగులే అతనికి టెస్టుల్లో ఇప్పటివరకు అత్యధికం.
కెప్టెన్‌గా జోరు..
భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సారథిగా తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు కోహ్లీ. 2017లో శ్రీలంకపై 243 రన్స్ సాధించిన టీమిండియా సారథి.. తాజాగా పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 254* పరుగులు చేశాడు.
భారత కెప్టెన్లు అత్యధిక పరుగులు..
254* (కోహ్లీ) vs దక్షిణాఫ్రికా (2019)
243 (కోహ్లీ) vs శ్రీలంక (2017)
235 (కోహ్లీ) vs ఇంగ్లాండ్ (2016)
224 (ధోనీ)vs ఆస్ట్రేలియా (2012)
అత్యధిక ద్విశతకాలు...
టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక ద్విశతకాలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు కోహ్లీ. తన కెరీర్లో 7వ ద్విశతకం చేసిన విరాట్.. భారత మాజీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్(6)లను అధిగమించాడు. అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ద్రవిడ్-5, గావస్కర్-4 సార్లు ద్విశతకాలు సాధించారు.
విధ్వంసకర వీరుల సరసన..
ఈ మ్యాచ్‌లో 200 పైచిలుకు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... టెస్టుల్లో విధ్వంసకర ఆటగాళ్ల సరసన చోటు దక్కించుకున్నాడు. 7 సార్లు 200పైగా పరుగులు చేసి వాలీ హామండ్, జయవర్ధనే సరసన నిలిచాడు. బ్రాడ్‌మన్-12, సంగక్కర-11, లారా-9, వాలీ హామండ్, జయవర్ధనే, కోహ్లీ-7 సార్లు ద్విశతకాలు చేశారు.
బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు..
ఆస్ట్రేలియా ఆటగాడు, ప్రపంచ టెస్టు దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డునూ బ్రేక్ చేశాడు కోహ్లీ. టెస్టుల్లో బ్రాడ్‌మన్(6996) రన్స్ చేశాడు. విరాట్ 7,054 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 21వేల మార్కును అధిగమించాడు.
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో 53వ స్థానంలో ఉన్నాడు విరాట్(7,054*). భారత బ్యాట్స్మన్లలో 7వ స్థానంలో ఉన్నాడు. ఇతడి కంటే ముందు సచిన్ తెందూల్కర్(15,921), ద్రవిడ్(13,265), గావస్కర్(10,122), లక్ష్మణ్(8,781), సెహ్వాగ్(8,503), గంగూలీ(7,212) ఉన్నారు.
26 శతకాల వీరుడు..
టెస్టుల్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీల రికార్డు సాధించిన నాలుగో క్రికెటర్ కోహ్లీ. ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను సమం చేశాడీ బ్యాట్స్‌మన్. ఈ ఘనతను విరాట్ 81 టెస్టుల్లో సాధించగా.. స్మిత్ 67 టెస్టులు తీసుకున్నాడు.
26 సెంచరీలు సాధించిన ఆటగాళ్లు (తక్కువ ఇన్నింగ్స్‌ల్లో)
69 ఇన్నింగ్స్‌లు -డాన్ బ్రాడ్‌మన్(ఆస్ట్రేలియా)
121 ఇన్నింగ్స్‌లు -స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)
136 ఇన్నింగ్స్‌లు -సచిన్ తెందూల్కర్(భారత్)
138 ఇన్నింగ్స్‌లు -విరాట్ కోహ్లీ(భారత్)
144 ఇన్నింగ్స్‌లు -సునీల్ గవాస్కర్(భారత్)
145 ఇన్నింగ్స్‌లు -మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా)
సఫారీలపై తక్కువ ఇన్నింగ్స్‌ల్లో @1000
సఫారీలపై టెస్టుల్లో వేయి పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సాధించిన ముగ్గురు భారత ఆటగాళ్లనూ అధిగమించాడీ క్రికెటర్. ఇతడి కంటే ముందు సెహ్వాగ్(20), తెందూల్కర్(29), ద్రవిడ్(30) ఉన్నారు. ఓవరాల్‌గా నలుగురు మాత్రమే కోహ్లీ కంటే ముందు దక్షిణాఫ్రికాపై వేయి పరుగులు చేశారు. డెన్నిస్ క్రాంప్టన్(13), నీల్ హార్వే(13), డేవిడ్ వార్నర్(18), మైకేల్ క్లార్క్(18) ఈ రికార్డు అందుకున్నారు.
కెప్టెన్@50
ఇప్పటివరకు 50 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రెండో భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు విరాట్. గతంలో 2008 నుంచి 2014 వరకు కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. 60 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి అగ్రస్థానంలో ఉన్నాడు. భారత మాజీ సారథి గంగూలీ(49)మూడో స్థానానికి పడిపోయాడు.
కెప్టెన్‌గా 150+ స్కోర్లు....
కెప్టెన్‌గా 150 పైగా పరుగులు ఎక్కువ సార్లు సాధించి.. ఆసీస్ దిగ్గజం బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. ఈ ఫార్మాట్లో కెప్టెన్‌గా 9 సార్లు 150 పైచిలుకు పరుగులు చేసి, బ్రాడ్‌మన్(8)ను వెనక్కినెట్టాడు. బ్రియన్ లారా, మహేలా జయవర్ధనే, గ్రేమ్ స్మిత్, క్లార్క్ 7సార్లు డబుల్ సెంచరీలు చేశారు.
టెస్టు కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో పాంటింగ్ సరసన చేరాడు కోహ్లీ(19). గ్రేమ్ స్మిత్ (25) అగ్రస్థానంలో ఉన్నాడు.
సౌతాఫ్రికాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు(టెస్టుల్లో)
సఫారీలపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు రన్ మెషీన్. సెహ్వాగ్ 319 పరుగులు చేయగా... కోహ్లీ 254*తో రెండో స్థానంలో నిలిచాడు. మయాంక్- 215, రోహిత్-176 తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
కోహ్లీకి ప్రత్యేకం..(టెస్టుల్లో)
పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో శతకం సాధించాడు విరాట్ కోహ్లీ. కెరీర్లో 26వ టెస్టు సెంచరీ కాగా... కెప్టెన్‌గా 19వది. అదే విధంగా ఈ ఏడాదిలో తొలి టెస్టు శతకం నమోదు చేశాడీ స్టార్ బ్యాట్స్‌మన్. సొంతగడ్డ మీద సౌతాఫ్రికా జట్టుపై మొదటి సెంచరీ సాధించాడు.
టెస్టు సెంచరీల్లో ఆసీస్ ఆటగాడు స్మిత్‌తో పోటీపడుతున్నాడు. ఇద్దరూ 26 శతకాలతో కొనసాగుతున్నారు.
11 ఇన్నింగ్స్‌ల తర్వాత ఈ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు ఇంత ఎక్కువ వ్యవధి ఎప్పుడూ తీసుకోలేదు ఈ స్టార్ క్రికెటర్. 2019లో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడి 2 అర్ధశతకాలు సాధించాడు.
భాగస్వామ్యంలోనూ భేష్...
టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం(178) నమోదు చేసింది కోహ్లీ- రహానే జోడి. ఇప్పటివరకు ఈ రికార్డు ద్రవిడ్-గంగూలీ (145) పేరిట ఉండేది. తర్వాత సెహ్వాగ్-బద్రినాథ్ (136) ఉన్నారు.
సగటు పెరిగిపోయింది...
విరాట్ కోహ్లీ సగటు ఒక్కసారిగా పెరిగింది. పుణె టెస్టు ముందు వరకు 53.13 సగటుతో ఉన్న కోహ్లీ... ప్రస్తుతం 55.11*తో ఉన్నాడు.