ఇప్పటికే తొలి టెస్టు గెలిచి ఊపుమీదున్న కోహ్లీసేన రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ మీద 137 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టించింది భారత్. మూడో టెస్టు ఈనెల 19న ప్రారంభంకానుంది.
తొలి ఇన్నింగ్స్‌లో 601 పరుగులకు డిక్లేర్ చేసింది టీమిండియా. కోహ్లీ డబుల్ సెంచరీ (254)తో మెరవగా, మయాంక్ అగర్వాల్ (108) సెంచరీతో ఆకట్టుకున్నాడు. జడేజా (91), రహానే (59) పుజారా (58) సత్తాచాటారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే ఆలౌటైంది. కేశవ్ మహారాజ్ (72), సారథి డుప్లెసిస్ (64) అర్ధ సెంచరీలతో మెరిశారు. డిబ్రుయిన్ (30), డికాక్ (31), ఫిలాండర్ (44) ఫర్వాలేదనిపించినా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. అశ్విన్ నాలుగు, ఉమేశ్ యాదవ్ మూడు, షమీ రెండు, జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం నాలుగో రోజు సఫారీ జట్టును ఫాలో ఆన్ ఆడించాడు కోహ్లీ. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే పరిమితమైంది డుప్లెసిస్ సేన. ఈ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్క ప్రొటీస్ ఆటగాడు అర్ధసెంచరీ సాధించలేకపోయాడు. ఎల్గర్ (48), బవుమా (38), ఫిలాండర్ (37) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మన్ ఆకట్టుకోలేకపోయారు. ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు దక్కించుకోగా, అశ్విన్ రెండు, ఇషాంత్, షమీ తలో వికెట్ పడగొట్టారు. డబుల్ సెంచరీతో మెరిసిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఇవీ చూడండి.. ఆసీస్ ఆటగాడి 13 ఏళ్ల దాహం తీరింది