ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు టీమ్ఇండియా బౌలర్ ఉమేశ్‌యాదవ్ దూరం కానున్నాడు. రెండో టెస్టులో అతడు గాయపడటమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. అయితే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశముందని స్పష్టం చేశాయి. అతడి స్థానంలో యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్‌ను తీసుకోనున్నట్లు తెలిపాయి.
రెండో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో తన నాలుగో ఓవర్ బౌలింగ్ వేస్తున్న సమయంలో ఉమేశ్ మోకాలికి దెబ్బ తగిలింది. వెంటనే అతడిని డ్రెసింగ్ రూమ్‌కు తరలించారు. ఇప్పటికే గాయాల కారణంగా మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ సేవలను కోల్పోయింది టీమ్ఇండియా. కాగా, జనవరి 7వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా ఆసీస్-భారత్ మూడో టెస్టులో తలపడనున్నాయి.
ఇదీ చూడండి : ఆసీస్ చెత్త ప్రదర్శన చేస్తోంది: పాంటింగ్