టీమ్‌ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ శుక్రవారం నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో పాసయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనకు అనుమతించడానికి బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన పరీక్షలో అతడు అర్హత సాధించాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో త్వరలోనే అతడు ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశం దొరికింది.
ఐపీఎల్ 13వ సీజన్‌లో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆ కారణంగానే లీగ్ స్టేజ్‌లో పలు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అదే సమయంలో బీసీసీఐ.. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి మూడు జట్లను ప్రకటించగా అందులో రోహిత్ పేరు లేదు. అనంతరం రోహిత్ ప్లేఆఫ్స్, ఫైనల్స్‌లో ఆడి ముంబయి జట్టును ఐదోసారి విజేతగా నిలిపాడు.
ఇలాంటి పరిస్థితుల్లో హిట్‌మ్యాన్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడాన్ని పలువురు విమర్శించారు. తర్వాత బీసీసీఐ స్పందించి రోహిత్‌ను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే, అంతకన్నా ముందు పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని చెప్పింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ముగిశాక ముంబయి సారథి తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. టీమ్‌ఇండియా అతడు లేకుండానే ఆస్ట్రేలియా బయలుదేరింది. రోహిత్ ఎన్‌సీఏలో ఉంటూ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే ఆలస్యం. ఒకవేళ రోహిత్ మరికొద్ది రోజుల్లో అక్కడికి వెళితే చివరి రెండు టెస్టులు ఆడే అవకాశం ఉంది. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్టు తర్వాత భారత్‌కు తిరిగి వస్తుండడం వల్ల రోహిత్ జట్టుతో కలవడం చాలా కీలకమైన విషయం.