ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఆ జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోతే.. తమ దేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.
ఇటీవల ఐపీఎల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు లీగ్ జరుగుతుందని స్పష్టం చేసింది. కివీస్‌తో ఇంగ్లాండ్ సిరీస్ జూన్ 2న ప్రారంభం కానుంది.
"ఇటీవల ఐపీఎల్ తేదీలు వచ్చాయి. ఇంగ్లాండ్‌కు సంబంధించి టెస్టు సిరీస్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోతే.. నేనా సిరీస్‌లో ఆడే అవకాశముంది. చూద్దాం, ఏం జరుగుతుందో. ఒకవేళ చెన్నై జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. అది వేరే విషయం" అని కరన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ భారత్‌లో జరగనున్న నేపథ్యంలో.. ఇండియాతో ప్రస్తుత పొట్టి సిరీస్ తమకు ఉపయోగపడుతుందని వెల్లడించాడు.
సీఎస్కే చాలా నేర్పింది..
సీఎస్కే తరఫున ఆడటం గొప్ప అనుభవంగా చెప్పుకొచ్చాడు కరన్. ఐపీఎల్‌తోనే తన ఆటతీరు మెరుగైందని అభిప్రాయపడ్డాడు. ఇది రానున్న టీ20 సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్ కప్‌కు ఉపయోగపడనుందని తెలిపాడు. 2020 ఐపీఎల్ సీజన్లో సీఎస్కే తరఫున 14 మ్యాచ్‌లాడిన కరన్.. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. 186 పరుగులతో పాటు 13 వికెట్లు తీశాడు.
"భారత్‌లో క్రికెట్ ఆడటం గొప్ప అనుభూతి. ఐపీఎల్‌ను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారు. అందుకే ఈ లీగ్‌లో ఆడటానికి ఆటగాళ్లు ఆసక్తి చూపిస్తారు. అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం ఉంటుంది. ఐపీఎల్‌తోనే నా ఆట మెరుగైందని నేను గతంలోనూ చెప్పాను. చాలా ఒత్తిళ్లు, సవాళ్లు ఎదుర్కొన్నాను. ఇవన్నీ నా ఆటకు ప్రయోజనం చేకూర్చాయి."
-సామ్ కరన్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్.
ఇదీ చదవండి: హాకీలో భారత్ అజేయం- బ్రిటన్‌పై గెలుపు