టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై సహఆటగాళ్లతో పాటు మాజీలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మళ్లీ ఆడతాడని అంటుంటే మరికొందరు రిటైర్మెంట్ ప్రకటించడమే ఉత్తమమని అంటున్నారు. అయితే తాజాగా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధోనీ గురించి మరో ఆసక్తికర విషయం చెప్పాడు. తనకు తెలిసి మహీకి మళ్లీ భారత జట్టు జెర్సీ ధరించే ఉద్దేశం లేదని తెలిపాడు.
"నేను చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ శిబిరంలో ఉన్నపుడు చాలామంది ధోనీ గురించి అడిగారు. నాకు తెలిసినంత వరకు అతడకి మళ్లీ టీమ్ఇండియా జెర్సీ ధరించే ఉద్దేశం లేదు. మహీ ఐపీఎల్ ఆడతాడు. కానీ వచ్చే టీ20 ప్రపంచకప్లో ఆడాలా వద్దా అన్నది అతడి నిర్ణయం."
-హర్భజన్ సింగ్, టీమ్ఇండియా స్పిన్నర్
ప్రస్తుతం టీమ్ఇండియా లోయర్ ఆర్డర్ బలహీనంగా ఉందని అన్నాడు హర్భజన్. టాపార్డర్లో రోహిత్, కోహ్లీలపై జట్టు ఎక్కువగా ఆధారపడుతుందని తెలిపాడు. తాను ఆడిన సమయంలో టాప్-3లో ఎవరైనా విఫలమైతే చివర్లో పరుగులు సాధించడానికి కృషి చేసే వారిమని గుర్తు చేశాడు. జట్టులో మ్యాచ్ విన్నర్ల కొరత ఉందని మేనేజ్మెంట్ దీనిపై దృష్టి సారించాలని కోరాడు.