ప్రపంచకప్‌లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని.. సైన్యానికి చెందిన బలిదాన్ గుర్తు వాడాడు. అప్పట్లో అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో అతడిపై ప్రశంసల జల్లు కురిసింది. అతడి దేశభక్తిని అభిమానులు మెచ్చుకున్నారు. ఐసీసీ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. గ్లౌజులపై బలిదాన్ గుర్తు తొలగించాలని సూచించింది. తర్వాత ఈ విషయంపై వివరణ ఇవ్వాలని బీసీసీఐని ఆదేశించింది ఐసీసీ. అప్పుడు జరిగిన సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు బీసీసీఐ పాలకమండలి అధ్యక్షుడు వినోద్‌రాయ్.

" అది పెద్ద విషయం కాకపోయినా ఆ సమయంలో పెద్ద రచ్చ అయింది. ధోని ధరించింది తన రెజిమెంటుకు సంబంధించిన గుర్తు కాదు. నిజంగా ఆ సింబల్ వాడకూడదని ఐసీసీ నిబంధనలో ఉన్నట్లే నాకు తెలీదు. ధోనీ ధరిస్తానంటే మాత్రం అతడి ఇష్టమని చెప్పి నేనూ మద్దతిచ్చా. తర్వాత ఐసీసీ 11 పేజీల నిబంధన పేజీలు చూశాను. అందులో తయారీదారుల గుర్తు మినహా ఎవ్వరిదీ గ్లౌజులపై ఉండకూడదని ఉంది".
--వినోద్‌రాయ్, బీసీసీఐ పాలకమండలి అధ్యక్షుడు
ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం పలికాడు. వెస్టిండీస్ పర్యటనకు దూరమైన మహీ... స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో లేడు. సెప్టెంబర్ 24 నుంచి జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ, నవంబర్‌లో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడని సమాచారం.